2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య

13 Feb, 2019 20:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు బలగాలకు చెందిన 96 మంది జవాన్లు 2018లో వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే నివేదిక ద్వారా 2016లో 90 మంది, 2017లో 121 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు బలగాల పని పరిస్థితుల మెరుగుదల అనేది ఒక స్థిరమైన ప్రయత్నమని, అవసరమైనపుడు హోంశాఖ తగు సూచనలు చేస్తుందని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి కిరణ్‌ రింకు రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కాలానుగుణంగా సమీక్ష నిర్వహిస్తోందని వివరించారు.

జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఒత్తిడికి గల కారణాలపై ప్రొఫెషనల్‌ ఏజెన్సీల ద్వారా సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో జవాన్లు పని చేసిన తర్వాత  ఒత్తిడి తగ్గించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్‌ ఇచ్చేలా  చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్‌గా అధికారులతో జవాన్లు తమ సమస్యలు చెప్పుకునే సమావేశాలు ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పని వేళలు కూడా తగ్గించి జవాన్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నట్లు, పని ఒత్తిడి మరింత తగ్గించేందుకు క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్‌ రింకు రాజ్యసభలో తెలిపారు.

మరిన్ని వార్తలు