వ‌ల‌స కార్మికుని కుటుంబాన్ని క‌బ‌ళించిన ప్ర‌మాదం

8 May, 2020 14:49 IST|Sakshi

ల‌క్నో: పొట్ట కూటికి వ‌ల‌స వెళ్లిన కార్మికుల నోట్లో లాక్‌డౌన్ మ‌న్ను కొట్టింది. చేతిలో చిల్లిగ‌వ్వ లేక‌, తిన‌డానికి తిండి లేక‌ కాలిబాట‌న కొంద‌రు, సైకిల్ తొక్కుతూ మ‌రికొంద‌రు రోడ్డెక్కిన విష‌యం తెలిసిందే. కానీ గ‌మ్యం చేరేలోపు ఎంద‌రో కార్మికులు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా సైకిల్‌పై స్వ‌స్థ‌లానికి ప‌య‌న‌మైన ఓ వ‌ల‌స కార్మికుడి కుటుంబాన్ని రోడ్డు ప్ర‌మాదం క‌బ‌ళించింది. ఈ విషాద ఘ‌ట‌న బుధ‌వారం రాత్రి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చ‌త్తీస్‌ఘ‌డ్‌కు చెందిన‌ కృష్ణ‌, అత‌ని భార్య ప్ర‌మీల ఉపాధి నిమిత్తం ల‌క్నో‌కు వ‌ల‌స వచ్చి అక్కడి జాన్కీపుర మురికివాడ‌లో నివ‌సిస్తున్నారు. వీరికి నాలుగేండ్ల కూతురు చాందినితోపాటు మూడేండ్ల కొడుకు నిఖిల్ ఉన్నారు.‌ (రైలు ప్రమాదం.. 16 మంది మృతి)

గ‌త నెల‌న్న‌ర రోజులుగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో కృష్ణ దంప‌తులు‌ ప‌ని లేక‌, తిండికి తిప్ప‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఎలాగైనా స్వ‌స్థ‌లానికి వెళ్లిపోదామ‌ని కుటుంబాన్నంతటినీ ఒకే సైకిల్‌పై తీసుకెళ్లాడు. అలా కొంత దూరం వెళ్లిన అనంత‌రం ష‌హీద్ పాత్ వ‌ద్ద‌ గుర్తు తెలియ‌ని వాహ‌నం వేగంగా వ‌చ్చి వీరి సైకిల్‌ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో సైకిల్ తునాతున‌క‌ల‌వ‌గా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. తీవ్ర గాయాల పాలైన‌ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చావు బ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్నారు. దంప‌తుల మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు ల‌క్నోకు చేరుకుని వారి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. (వలస కూలీ విలవిల)

మరిన్ని వార్తలు