జీపు ఢీకొని  వలస కూలీ మృతి

27 Feb, 2018 09:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోడ్డు పనులకు తెలంగాణ నుంచి వచ్చిన మహిళ

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు యత్నం 

కృష్ణాయపాలెం (మంగళగిరి టౌన్‌): రాజధాని పుణ్యమా అంటూ వెనుకబడిన జిల్లాల నుంచి తక్కువ కూలికి వేలాది మంది కార్మికులు రాజధాని ప్రాంతానికి వస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందినా  పట్టించుకునే వారే లేకపోవడంతో కుటుంబలకు తీరని వ్యథే మిగులుతోంది. తాజాగా రాజధాని పరిధిలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. కృష్ణాయపాలెంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు బి.ఎస్‌.ఇ.పి.ఎల్‌. అనే కంపెనీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది.

పనులు చేసేందుకు తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా నుంచి వందలాది మంది కూలీలు గ్రామానికి వచ్చారు. ఆదివారం ఎత్తిరాల తిమ్మమ్మ (26) రోడ్డుపై రాళ్లు ఏరుతుండగా సంస్థకు చెందిన ఓ జీపు రివర్స్‌లో వస్తూ యువతిని ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. సంస్థ ప్రతినిధులు సోమవారం కూడా జీపు డ్రైవర్‌ను, జీపును పోలీసులకు అప్పగించకపోవడం గమనార్హం.

చర్యలు శూన్యం..
ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ యజమానులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని  తరలించేందుకు సన్నాహాలు చేశారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో చేసేదేం లేక పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాన్ని మంగళగిరి ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి మార్చురీలో భద్రపరిచారు. వైద్యులు సోమవారం సాయంత్రానికి కూడా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎక్కడ ప్రమాదం జరిగినా పోలీసులు వెంటనే మృతదేహాన్ని స్వాధీనపరచుకుని పోస్టుమార్టం నిర్వహించి, సంబంధిత వాహనంపై కేసు నమోదు చేస్తారు. కానీ రాజధానిలో ఏం జరిగినా బయటకు రాకపోవడం, రెండు మూడు రోజుల తర్వాత బయటకు వస్తుండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు