సిటీ కేంద్రంగా కాల్‌ రూటింగ్‌!

29 Dec, 2018 10:26 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితుడు దినేష్‌

నల్లకుంటలో మినీ ఎక్సే్ఛంజ్‌ ఏర్పాటు

గుర్తించిన మిలటరీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌

నిందితుడిని పట్టుకున్న నల్లకుంట పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌ పద్ధతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ) పద్ధతిలో లోకల్‌ కాల్స్‌గా మార్చే కాల్‌ రూటింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఒకటి హైదరాబాద్‌లో నడుస్తున్నట్లు మిలటరీ ఇంటెలిజెన్స్‌ (ఎంఐ) అధికారులు గుర్తించారు. వారు అందించిన సమాచారం మేరకు నల్లకుంట పరిధిలో దాడులు నిర్వహించిన పోలీసులు దినేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూటర్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్‌ రూటింగ్‌ వ్యవహారం వెనుక ఉగ్రవాద కోణం ఉన్నట్లు ఎంఐ అనుమానిస్తుండగా, నిందితుడిని వివిధ కోణాల్లో విచారించిన నగర పోలీసులు అలాంటి లేదని తేల్చారు. ఈ తరహా ఎక్స్‌ఛేంజ్‌లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్‌ గోయింగ్‌) బయటి దేశాలకు పంపలేవని, కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటిని మాత్రమే లోకల్‌ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్‌కమింగ్‌) అందించగలవని అధికారులు తెలిపారు.

ఇంటర్నేషనల్‌ కాల్‌ వచ్చేది ఇలా...
విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్‌ కాల్‌ అక్కడి ఎక్స్‌ఛేంజి నుంచి నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేదా శాటిలైట్‌ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడికి చేరిన ఫోన్‌కాల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్‌ రిసీవ్‌ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్‌ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.   

ఆ మొత్తం ఎగ్గొట్టడానికే...
ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్‌ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతా విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్‌ రూటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్‌ విదేశాలకు వెళ్లాలంటే (ఔట్‌ గోయింగ్‌) కచ్చితంగా అది సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ పైనా ఏజెన్సీల నిఘా ఉండటంతో అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్‌ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మారుస్తుంటారు.  

రూటింగ్‌ జరిగేది ఇలా...
విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్‌నెట్‌ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయిస్తారు. అనంతరం విదేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్‌ కాల్‌ అక్కడ డేటాగా మారిపోతుంది. దానిని ఇంటర్‌నెట్‌ ద్వారా నేరుగా ఇక్కడ ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్‌వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్‌) బోగస్‌ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్‌ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్‌ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డునకు చెందిన నంబరు (లోకల్‌) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్‌ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్‌ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు దెబ్బతింటున్నాయి. ఇలా దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్‌ ఆ మొత్తాన్నీ మిగుల్చుకుంటున్నాడు. ఇక్కడ అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులు హవాలా రూపంలో కమీషన్‌ పంపిస్తుంది.  

ఈ కారణంగానే ప్రాధాన్యం...
దినేష్‌ చేస్తున్న కాల్‌ రూటింగ్‌ వ్యవహారానికి సంబంధించి నగర పోలీసులకు మిలటరీ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. సాధారణంగా ఈ తరహా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఉగ్రవాదానికి ఉపకరించే అక్రమ లావాదేవీల పైనా కన్నేసి ఉంచుతాయి. ఈ నేపథ్యంలో రూటింగ్‌ వ్యవహారం వారి దృష్టికి వచ్చింది. పాక్‌ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారులను ట్రాప్‌ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్‌’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలు, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్‌ చేయడానికి కాల్‌ రూటింగ్‌ విధానాన్నే వినియోగిస్తారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల అధికారులకు ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. కాల్‌ బ్యాక్‌ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్‌ ద్వారానే దీనికి పాల్పడ్డారు. దీంతో దినేష్‌ వ్యవహారంలోనూ అలాంటి కోణం ఉంటుందని ఎంఐ అనుమానించింది. దీంతో అతడిని పోలీసులు లోతుగా విచారించి అలాంటిది లేదని తేల్చారు.

మరిన్ని వార్తలు