మహా ముదురు!

27 Oct, 2018 10:25 IST|Sakshi

ఈ కామర్స్‌ సైట్స్‌ను తలదన్నుతూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఎర

తక్కువ ధరకు ఎలక్ట్రానిక్‌ వస్తువులంటూ ప్రకటనలు

ఆసక్తి చూపిన వారితో వాట్సాప్‌ ద్వారా బేరసారాలు

అనేక మంది నుంచి రూ.3 లక్షలు దండుకున్న వైనం

జువైనల్‌ హోమ్‌కు తరలించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్‌ఎక్స్, క్వికర్‌లో వంటి సైట్స్‌ను ఆధారంగా చేసుకుని తక్కువ ధరకు వస్తువులంటూ ఎర వేసి, అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లను ఇప్పటి వరకు చూశాం. అయితే నగరానికి చెందిన ఈ మైనర్‌ మాత్రం మహా ముదురులా వ్యవహరించాడు. ఇన్‌స్ట్రాగామ్‌ కేంద్రంగా మోసాలకు తెరలేపాడు. తక్కువ మొత్తాలే టార్గెట్‌గా చేసుకుని దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.3 లక్షలు కాజేశాడు. ఇద్దరు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జువైనల్‌ హామ్‌కు తరలించారు. ఇతను జనాల నుంచి సొమ్మును తన తండ్రి పే–టీఎం ఖాతాలోకి డిపాజిట్‌ చేయించి స్వాహా చేయడం కొసమెరుపు. ఓ దశలో దీనిపై ఆ తండ్రి ప్రశ్నించగా... ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతానంటా బెదిరించాడని తెలిసింది.  

నష్టపోయి అదే బాట పట్టి...
నగరానికి చెందిన మైనర్‌ (16 ఏళ్లు) ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు వస్తువుల విక్రయం ప్రకటన చూసిన అతను వారిని సంప్రదించాడు. బేరసారాల అనంతరం వారు చెప్పిన ఖాతాలో నగదు డిపాజిట్‌ చేసినా వస్తువు డెలివరీ కాలేదు. మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు. దీంతో మోసపోయానని భావించిన అతగాడు అదే పని ప్రారంభించాడు. నెట్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా రోటీన్‌కు భిన్నంగా ఇన్‌స్ట్రాగామ్‌ను ఎంచుకున్నాడు. అందులో ‘మిలియనీర్స్‌ ట్రెండ్‌’ పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేశాడు. అందులో కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాచీలు, వస్త్రాల వివరాలు పొందుపరిచాడు. వీటిని అతి తక్కువ ధరకు విక్రయిస్తానంటూ ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. దీనిని చూసి ఆకర్షితులైన వారితో కేవలం వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. బేరసారాల అనంతరం వస్తువు రేటు ఖరారు చేసే వాడు.  

తండ్రి పే–టీఎం ఖాతాతో...
ఖరారైన రేటుకు వస్తువులు ఖరీదు చేయాలని భావించే వారికి తన తండ్రి పే–టీఎం ఖాతాకు సంబం«ధించిన క్యూఆర్‌ కోడ్‌ వాట్సాప్‌ ద్వారా పంపేవాడు. దానిని స్కాన్‌ చేసుకుని ఆ మొత్తాన్ని అందులో డిపాజిట్‌ చేయమని సూచించాడు. అతడి తండ్రి రామ్‌కోఠిలోని ఓ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కోసం దుకాణ యజమాని ఈ పే–టీఎం ఖాతా తెరిచి ఇచ్చాడు. తన ఖాతాలో నగదు బదిలీ కావటం, కుమారుడు ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసుకోవడాన్ని గుర్తించిన ఆయన అదేమని కుమారుడిని నిలదీయగా... ఎదురు తిరగడంతో పాటు మరోసారి అడిగితే ఎలాంటి సమాచారం లేకుండా ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించాడు. దీంతో అతను ‘చేయరానిది చేస్తే కుటుంబం పరువు పోతుంది’ అంటూ నచ్చజెప్పినా అతడిలో మార్పు రాలేదు.  

చిన్న మొత్తాలనే స్వాహా చేస్తూ...
ఇన్‌స్ట్రాగామ్‌ ప్రకటనల పట్ల ఆకర్షితులైన వారి నుంచి నగదు కాజేయడంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కువ మొత్తాలు కాజేస్తే వారు సీరియస్‌గా తీసుకుని కేసుల వరకు వెళ్తారని భావించిన అతను ఒక్కొక్కరి నుంచి కనిష్టంగా రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు మాత్రమే స్వాహా చేయడం మొదలెట్టాడు. ఈ పంథాలో దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.3 లక్షల వరకు కాజేశాడు. వారిలో ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లలేదు. అయితే సిటీకి చెందిన ఇద్దరు రూ.8,500, రూ.7 వేల చొప్పున కోల్పోయారు. వీరు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. చివరకు ఈ మైనరే బాధ్యుడని గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకుని జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జువైనల్‌ హోమ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు