నిమజ్జనానికి వద్దన్నారని.. గోవాకు వెళ్లాడు

18 Sep, 2019 11:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొడుకును కిడ్నాప్‌ చేశారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు

పోలీసులను బెంబేలెత్తించిన మైనర్‌ బాలుడు

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ని ట్రేస్‌ చేసిన నారాయణగూడ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనానికి తల్లిదండ్రులు వెళ్లొద్దన్నందుకు ఓ మైనర్‌ బాలుడు ఇంట్లో చెప్పకుండా యాక్టివాపై గోవాకు వెళ్లిపోయాడు. పొద్దున్నే లేచి బెడ్‌రూమ్‌లో చూడగా కుమారుడు కనిపించడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో నారాయణగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ కేశవమెమోరియల్‌ కళాశాల సమీపంలో ఉండే రాజస్థాన్‌కు చెందిన కుటుంబం ఈ నెల 5న స్వరాష్ట్రం వెళ్లి తిరిగి 11వ తేదీన నగరానికి వచ్చారు. అదేరోజు రాత్రి వారి కొడుకు(16) ఉదయం నిమజ్జనానికి వెళ్తానని అడగ్గా అందుకు తల్లిదండ్రులు వద్దంటూ వారించారు. కాగా 12వ తేదీ తెల్లవారుజామున బాలుడు పాత యాక్టివాపై గోవాకు వెళ్లిపోయాడు. ఉదయం కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తమ కొడుకును ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడికి ఏ ఫోన్‌ నుంచి కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోగా.. ఆ నంబర్‌ని బ్లాక్‌లిస్టులో పెట్టసాగాడు.  

బెల్గాం వద్ద రెండు ముక్కలైన యాక్టివా 
ఈనెల 12వ తేదీ అర్ధరాత్రికి యాక్టివాపై ‘బెల్గాం’ చేరుకున్న బాలుడు అక్కడ పెద్ద గుంతలో పడ్డాడు. దీంతో యాక్టివా రెండు ముక్కలైంది. ఈ క్రమంలో అడ్మిన్‌ ఎస్సై కర్ణాకర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సిగ్నల్స్‌ని ట్రేస్‌ చేసి బాలుడు గోవా హైవేపై మహబూబ్‌నగర్‌ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్సై అక్కడి పోలీసులకు సమచారమివ్వగా అక్కడి పోలీసులకు దొరకలేదు. దాంతో పోలీసుల సలహా మేరకు బాలుడి తండ్రి గోవాకు వెళ్లగా బాలుడు ‘అంజునా’ బీచ్‌ దగ్గర ఓ రూమ్‌లో ఉన్నట్టు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు తెలుసుకుని తండ్రికి సమాచారమిచ్చారు. దాంతో అక్కడ ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమైయ్యింది. నారాయణగూడ ఎస్సై కర్ణాకర్‌రెడ్డి చొరవతో ‘కిడ్నాప్‌ కథ’ 24 గంటల్లో తేలిపోయింది.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా