బెజవాడ: అల్లరి మూకల చిల్లర చేష్టలు!

11 Nov, 2019 20:44 IST|Sakshi

భయం.. భయం...భయం. బెజవాడ శివారుల్లో ఇప్పుడు వినినిపిస్తున్న మాటలు ఇవే. కనిపిస్తున్న దృశ్యాలు కూడా అవే. దొంగలెవరో, దొరలెవరో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో.. ఎప్పుడు ఏ ఇల్లు దోపిడీకి గురౌతుందో తెలియని పరిస్థితి. ఏ దుకాణం లూటీ అవుతుందోనన్న ఆందోళన నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులకు సవాల్­గా మారిన అల్లరి మూకల చిల్లర చేష్టలపై ప్రత్యేక కథనం..

సాక్షి, విజయవాడ: బెజవాడ... ఒకప్పుడు ఈ పేరు వింటే రౌడీయిజం ముందుగా గుర్తొచ్చేది.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ తల్లి కూడా ఆ తర్వాతే గుర్తొచ్చేది. విజయవాడ అధికార కేంద్రంగా మారాక.. పోలీసులు పట్టుపెంచాక రౌడీయిజం చాలా వరకు కంట్రోల్ అయ్యింది. నేరాలకు అడ్డుకట్ట పడింది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తలదాచుకునే వారి సంఖ్యా రోజురోజుకి రెట్టింపవుతోంది. అదే సమయంలో విజయవాడ కల్చర్­లో కూడా వేగంగా మార్పులు వచ్చాయి. సిటీ స్టైల్ కొందరి వేషభాషల్లో మార్పు తెస్తే... మరికొందరిని తప్పుడు దారుల్లో నడిపిస్తోంది. పెరిగిన పబ్ కల్చర్ వ్యసనాలకు బానిసల్ని చేస్తోంది.

తల్లితండ్రుల పర్యవేక్షణ కొరవడటం, చదువు, సంధ్యలు లేకపోవటంతో చెడుదారి పట్టేవారి సంఖ్య పెరుగుతోంది. జల్సాలు తీర్చుకునే ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారు. మద్యానికి బానిసలై, మత్తుపదార్దాల సేవికులై కిక్కు తలకెక్కడంతో తిక్క చేష్టలు చేస్తూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. ఇటీవల విజయవాడ శివారుల్లో బ్యాడ్‌ గ్యాంగులు వణుకుపుట్టిస్తున్నాయి. నిస్సహాయులపై బ్లేడ్లతో దాడి చేసి దోచుకుంటున్నారు. మరికొందరు దుకాణాలను టార్గెట్ చేసి రాత్రిళ్ళు లూటీ చేసేస్తున్నారు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు.

గంజాయి, మద్యం, వైటనర్, సిగరెట్లు, గుట్కాలు.. అన్నింటినీ ఏకకాలంలో వాడేస్తూ ఎటు చూసినా మద్యంలో జోగేవాళ్లే కనిపిస్తున్నారని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ యువత ఈజీ మనీ కోసం దోపిడీలకు దిగుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ఇటీవల అజిత్ సింగ్ నగర్లోని మూడు షాపుల్లోనూ వరుసగా దోపిడీలకు పాల్పడ్డారు. వరుస కంప్లైంట్లతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు మైనర్లను, మరో ఇద్దరు యువకుల్ని పట్టుకున్నారు.

ఈ మధ్య ఉల్లిపాయల ధర పెరగడంతో.. చిల్లర గ్యాంగులు వాటిని కూడా ఎత్తుకుపోయి సొమ్ముచేసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ రెచ్చిపోతున్న పోకిరీ బ్యాచ్ దెబ్బకు అమ్మాయిల్ని ఒంటరిగా బయటికి పంపాలంటే వణికిపోతున్నారు స్థానికులు.

శాంతి భద్రతల పరిరక్షణలో సక్సెసైన ఏపీ పోలీసులు పాత నేరస్థులపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ని కంట్రోల్ చేయటంలో సఫలీకృతులయ్యారు. ఐతే మత్తులో జోగుతూ.. జల్సాల కోసం చోరీలు చేసేవారే ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారారు. స్థానికుల ఆందోళనతో పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా