ఒకరిది ప్రేమ పేరుతో వంచన.. మరొకరిది నమ్మక ద్రోహం!

13 Oct, 2019 10:39 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న గాయత్రి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుజాత

న్యాయం కోసం బాధితుల పాకులాట 

ఒక ఘటనలో జాతకాలు సాకు చెప్పి తప్పించుకున్న ప్రియుడు 

మోసాన్ని జీర్ణించుకోలేక ప్రియురాలు ఆత్మహత్య 

మరో ఘటనలో అదనపు కట్నం తేలేదంటూ రెండో పెళ్లి చేసుకున్న భర్త  

పోలీసులే అన్యాయం చేశారంటూ వివాహిత తల్లి ఆత్మహత్యాయత్నం 

రెండూ వేర్వేరు ఘటనలు. ఒకరిది ప్రేమ పేరుతో వంచన.. మరొకరిది నమ్మక ద్రోహం! పెళ్లి పేరుతో ఒకరు మోసం చేస్తే.. అదనపు కట్నం వ్యామోహంలో కట్టుకున్న ఇల్లాలిని దగా చేశాడు మరొకడు. న్యాయం కోసం పాకులాడిన బాధితులకు అన్యాయమే ఎదురైంది. భరించలేని చిరుప్రాయం తీవ్ర మనోవేదనకు లోనైంది. ధైర్యం చెప్పే వారు లేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గుంతకల్లులో సంచనలం కాగా, మరో ఘటనలో పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ జీవితంపై విరక్తితో పోలీస్‌ స్టేషన్‌ ఎదుటనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే..  
 

దగాపడ్డ మైనర్‌ 
సాక్షి, గుంతకల్లు: పెళ్లి పేరుతో యువకుడు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక ఓ మైనర్‌ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంతకల్లులో సంచలనం రేకెత్తించింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... పాత గుంతకల్లులోనే వాల్మీకి సర్కిల్‌లో నివాసముంటున్న మహాదేవి కుమార్తె గాయత్రి (17), దోనిముక్కల రోడ్డు గుట్టల వీధికి చెందిన నరేష్‌ అనే యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ పెద్దలకు తెలిపి వివాహానికి అంగీకరింపజేశారు. మరి కొన్ని నెలల్లో పెళ్లి చేయాలని ఇరువైపులా పెద్దలు భావించారు. ఇదే అదనుగా భావించిన నరేష్‌.. గాయత్రిని ఒప్పించి శారీర అవసరాలు తీర్చుకుంటూ వచ్చాడు. ఈ లోపు పెళ్లి ముహుర్తాలు తీసేందుకు పురోహితుడిని ఇరువైపులా కుటుంబసభ్యులు కలిసారు. ఇద్దరి జాతకాలు సరిపోవడం లేదని పురోహితుడు తెలపడంతో పెళ్లికి నరేష్, అతని తల్లి సిద్దమ్మ, సోదరి నాగమణి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గాయత్రి శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం 
కదిరి టౌన్‌: తమకు న్యాయం చేయడం లేదంటూ జీవితంపై విరక్తితో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కదిరి పట్టణానికి చెందిన సుజాత తన కుమార్తె శైలజ వివాహం వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేటకు చెందిన శ్రీనివాసులుతో జరిగింది. ఆరు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత అదనపు కట్నం కోసం ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శైలజ గర్భం దాల్చి ప్రసవం కోసం పుట్టినింటికి చేరుకుంది. ఇదే అదనుగా భావించిన శ్రీనివాసులు రాజంపేటలో మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై పోలీసులకు కుమార్తెతో కలిసి తల్లి సుజాత ఫిర్యాదు చేసింది. నెల రోజులుగా సీఐ మల్లికార్జునగుప్తా చుట్టూ తిరిగినా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం తిరిగి శైలజను పిలుచుకుని సుజాత మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. సాయంత్రం వరకూ పడిగాపులు కాసినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తితో పోలీస్‌ స్టేషన్‌ ఎదుటనే విషపూరిత ద్రావాణాన్ని తాగి సుజాత ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కాగా, తన అల్లుడి వద్ద నుంచి రూ. 50 వేలు తీసుకుని సీఐ తమకు అన్యాయం చేస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు