బాలిక సజీవదహనం

8 Jul, 2020 09:14 IST|Sakshi
హత్యకు గురైన గంగాదేవి (ఫైల్‌)

కాలిన శరీరంతో మృతదేహం లభ్యం

తిరుచ్చిరాపల్లి జిల్లాలో ఘోరం

లాక్‌డౌన్‌ రోజుల్లో ఆరో ఘటన

సుమోటాగా విచారణ చేపట్టిన జాతీయ కమిషన్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుకోట్టై జిల్లాలో ఇటీవలే ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, కిరాతకంగా హతమార్చిన ఉదంతం నుంచి ఇంకా కోలుకోక ముందే తిరుచ్చిరాపల్లి జిల్లాలో మరో ఘోరం జరిగిపోయింది. ఆడుతూ పాడుతూ అందరిముందు తిరుతుండిన మైనర్‌ బాలిక అంతలోనే శరీరం కాలిపోయిన స్థితిలో ముళ్లపొదల్లో శవంగా మారిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చిరాపల్లి జిల్లా సోమరసంపేట అదవత్తూరుపాళయంకు చెందిన  పెరియస్వామి (45) రైతుకు భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె గంగాదేవి (14) ఎట్టరై ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో సహచరి విద్యార్థినులతో కలిసి ఆడుకుంది.

ఆ తరువాత ఇంట్లోని చెత్తను పారవేసేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన గంగాదేవి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చేపట్టగా అడవిలోని ముళ్లపొదల్లో శరీరమంతా కాలిపోయిన స్థితిలో బాలిక శవంగా పడి ఉంది. సమీపంలో ఒక లీటరు క్యానులో కొద్దిగా కిరసనాయిలు, సంఘటన జరిగిన రోజున బాలిక ధరించిన దుస్తులు సమీపంలో చిరిగిపోయి పడి ఉన్నాయి. కుమార్తెను సజీవంగా తగలబెట్టారంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు.  బాలిక శవాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు పోలీసులు సిద్ధపడగా గ్రామస్తులు అడ్డుకుని నిందితులను అరెస్ట్‌ చేసేవరకు పంచనామా చేయరాదని బైఠాయించారు.

అదే సమయానికి అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ అద్దాలను పగలగొట్టి రాస్తారోకోకు దిగారు. పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక శవాన్ని తిరుచ్చిరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుచ్చి ఎస్పీ, ఏఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ బాలికపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది చెప్పగలమని తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుక్కోట్టై జిల్లా అరిమళంలో ఏడేళ్ల చిన్నారిపై కొన్ని రోజుల క్రితమే లైంగికదాడి, దారుణహత్య జరిగింది. ఇంతలోనే మరో బాలికను వికృతంగా హతమార్చిన సంఘటనతో ప్రజల్లో భీతినెలకొంది. తిరుచ్చిరాపల్లి మండల డీఐజీ విజయ మీడియాతో మాట్లాడుతూ బాలిక ఒంటి నిండా ఉన్న కాలినగాయాలపై పరిశోధన చేయాల్సిందిగా వైద్య నిపుణులను కోరామని తెలిపారు.

నిందితులను పట్టుకునేందుకు ఏడీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లతో కూడిన 11 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను వదిలే ప్రసక్తేలేదన్నారు. కఠిన శిక్షకు గురిచేస్తామన్నారు. ఇదిలా ఉండగా, బాలికపై లైంగికదాడి జరగలేదని మంగళవారం విడుదల చేసిన పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తేటతెల్లమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఈ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణ జరిపేందుకు ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తరువాత తమిళనాడులో ఆరు సార్లు బాలికలపై ఆఘాయిత్యాలు, లైంగికదాడుల ఘటనలు చోటుచేకున్నాయి. కమిషన్‌ సైతం ఆరోసారి తమిళనాడులోని కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.  

మరిన్ని వార్తలు