ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మైనర్‌కు వల

27 Jun, 2020 07:05 IST|Sakshi

దొడ్డబళ్లాపురం : కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ వచ్చి పిల్లలు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే పాఠాలు మిస్‌ అవ్వకూడదని కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాయి. దీంతో పిల్లలు ఆన్‌లైన్‌తోపాటు ఇంటర్నెట్‌కు బాగా దగ్గరయ్యారు. సోషల్‌ మీడియాలో మునిగితేలుతున్నారు. ఇలా సోషల్‌ మీడియాకు బానిససైన మైనర్‌ బాలిక ఒక మాయలోడి మాయలో పడి మోసపోయింది. అయితే చివరి క్షణంలో ఆమె తండ్రి చొరవతో క్షేమంగా బయటపడింది. ఘటనకు సంబంధించి వివరాలు.. బెంగళూరు ఉత్తరహళ్లిలోని ఏజీఎస్‌ లేఔట్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక ఆన్‌లైన్‌ పాఠాలతో ఇంటర్నెట్, సోషల్‌ మీడియాకు బాగా అలవాటు పడింది.

ఈ క్రమంలో లాక్‌డౌన్‌ అమలయినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత ఫోటోలు కూడా అప్‌లోడ్‌ చేస్తూ ఉండేది. ఇలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విశాల్‌ బాలికతో నిన్ను వదిలి ఉండలేనని, హైదరాబాద్‌ వచ్చేయాలని చెప్పాడు. దీంతో బాలిక జూన్‌ 8వ తేదీన మ్యూజిక్‌ క్లాస్‌ వెళ్లాలని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చి నేరుగా కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కుమార్తెలో మార్పును మొదటి నుంచి గమనిస్తున్న తండ్రి ఎంతసేపటికీ కూతురు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌‌ డీకోడ్‌ చేసి చాటింగ్‌ హిస్టరీ చూసి విషయం తెలుసుకున్నాడు.

చాటింగ్‌లో విశాల్‌ హైదరాబాద్‌ రావడానికి బాలికకు విమానం టిక్కెట్‌ కూడా బుక్‌ చేసిన సంగతి తెలిసింది. నేరుగా ఎయిర్‌‌పోర్టుకు వెళ్లగా కుమార్తె పట్టుబడింది. ఇదే నెల 17న తండ్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ బాలికకు 18 సంవత్సరాలు నిండాయని నమ్మించడానికి నకిలీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ మార్క్స్‌ కార్డ్‌ తయారు చేయించాడు. వస్తూ ఫోటోలు, ఆధార్‌కార్డు, కొంత నగదు తీసుకురావాలని చెప్పడంతో బాలిక ఆదేవిధంగా చేసింది. అయితే విశాల్‌కు సంబంధించి ఎటువంటి వివరాలు పోలీసులకు ఇంకా లభించలేదు. సైబర్‌ క్రైం, పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్‌ 468 కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు