కొడుకులా చూసుకున్నాం, కానీ...

3 Jun, 2018 08:57 IST|Sakshi
సీసీఫుటేజీ దృశ్యంలో చిన్నారిని తీసుకెళ్తున్న నిందితుడు భోలు

ఫరిదాబాద్‌: హర్యానాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. కన్నకొడుకులా చూసుకున్న యాజమానికి తీరని శోకం మిగిల్చిందో మానవ మృగం. నాలుగేళ్ల చిన్నారిని అతిక్రూరంగా హత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఆపై మృతదేహాన్ని తన ఇంట్లో దాచిపెట్టాడు. ఫరిదాబాద్‌లోని పల్వాల్‌ మండలం అసోథి గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

దారుణం... చిన్నారి తండ్రి స్థానికంగా ఓ స్వీట్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. 24 ఏళ్ల భోలు అలియాస్‌ వీరేందర్‌ ఆ షాపులో తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన భోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం చంపి, ఇంట్లోని డ్రమ్‌లో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లు తిరిగి దుకాణానికి వచ్చేశాడు. బాలిక కనిపించపోయే సరికి కంగారుపడిన తల్లిదండ్రులు ఊరంతా వెతకటం ప్రారంభించారు. వారికి భోలు కూడా సాయం చేస్తున్నట్లు నటించాడు.

నిందితుడి తల్లి సహకారం... అయితే చిన్నారి తండ్రితో కొందరు స్థానికులు.. బాలికను భోలు తీసుకెళ్లటం చూశామని చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది. భోలు ఇంటికి చేరుకున్న బాలిక బంధువులు ఇంట్లో సోదాలు చేసేందుకు యత్నించారు. అయితే భోలు తల్లి మాత్రం వాళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. పైగా వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో బలవంతంగా వారంతా ఇంట్లోకి చొరబడి సోదా చేశారు. చివరకు ఓ గదిలో రక్తపు మరకలు, డ్రమ్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భోలుని, నేరానికి సహకరించిన అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు.  (కథువా ఘటన కథనాలు)

ఉరి తీయాలి... ‘తొమ్మిదేళ్లుగా నా దగ్గర నమ్మకంగా పని చేశాడు. కొడుకులా చూసుకున్నాం. కానీ, నా కూతురినే కిరాతకంగా చంపాడు. వాడి కళ్ల ముందే పుట్టి పెరిగిన నా బిడ్డను మృగంలా కబలించాడు. వాడిని ఉరి తీస్తేనే న్యాయం జరుగుతుంది. నాలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు’ అని చిన్నారి తండ్రి కోరుతున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో బాలల హక్కుల సంఘాలు శనివారం ఫరిదాబాద్‌లో సంఘీభావ ర్యాలీని నిర్వహించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు కోరుతున్నాయి.

 

కేసులు నమోదు... కాగా, ఘటన అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో బలగాలను మోహరించిన పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు. ఐపీసీతోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. సీసీఫుటేజీ, నిందితుడి ఇంట్లో రక్తపు మరకల, స్థానికుల స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులపై అభియోగాలు నిరూపణ అయ్యే అవకాశం ఉందని దేవేంద్ర సింగ్‌ అనే అధికారి వెల్లడించారు. భోల్‌కు వివాహమైనప్పటికీ అతని పద్ధతి నచ్చని భార్య రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం భోలు, అతని తల్లి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు