మనిషా? లేక రాక్షసా? ...

5 Oct, 2017 17:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పని పేరుతో తన దగ్గరకు తెచ్చుకున్న మైనర్‌పై ఓ యువతి అతికిరాతకంగా వ్యవహరించింది. రెండేళ్లుగా శారీరకంగా తీవ్రంగా హింసిస్తుండటంతో ఆ వేధింపులు తట్టుకోలేక బాలిక పై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించింది. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

బిహార్‌కు చెందిన యువతి(23) ఫరిదాబాద్‌ లో చదువుకుంటోంది. తన స్వగ్రామంలోని ఇంట్లో పని చేసే దంపతుల కూతురిని తన అవసరాల నిమిత్తం రెండేళ్ల క్రితం వెంట తెచ్చుకుంది. కొన్నాళ్లపాటు బాగానే చూసుకున్న యువతి.. హఠాత్తుగా మారిపోయింది. ఇంట్లోంచి కాలు కూడా బయటపెట్టనీయకుండా బాలికను ఆ యువతి దారుణంగా హింసించటం మొదలుపెట్టింది. 

లోపలి నుంచి ఏడుపులు వినిపించటంతో చుట్టుపక్కల వారు యువతిని ప్రశ్నించగా.. మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరూ చూస్కోండి  అంటూ యువతి పరుషంగా బదులు ఇచ్చేదంట. ఈ క్రమంలో ఆ వేధింపులను తట్టుకోలేక పారిపోవాలని బాలిక నిర్ణయించుకుంది. బుధవారం వారిద్దరూ ఉంటున్న కనిష్క టవర్స్‌ 11వ అంతస్థు నుంచి కిందకు దూకేసింది. అయితే కింది ఫ్లోర్‌ లోనే ఉన్న పిట్ట గూడులో ఇరుక్కుపోయి భయంతో అరవ సాగింది. 

తొమ్మిదవ ఫ్లోర్‌లో ఉన్న ఓ టీచర్‌ ఆ ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి బాలికను రక్షించి విముక్తి కల్పించారు. బాలిక శరీరం మొత్తం కాల్చిన గాయాలు ఉన్నాయి. ప్రతీ రోజు తనకు నరకం చూపించిందని ఆ బాలిక చెబుతోంది.  బాల కార్మిక చట్టం కింద యువతిపై కేసు నమోదు చేసి.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ సిద్ధం చేశారు. కాగా, బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చేంత వరకు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచాలని ఫరిదాబాద్‌ శిశు సంరక్షణం కమిటీ అధికారి హెచ్‌ఎస్‌ మాలిక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు