ప్రేమజంటపై దుండగుడి దాడి

8 Mar, 2018 12:10 IST|Sakshi
దాడిలో గాయపడిన సాల్మా రాజు

అపస్మారక స్థితిలో పడి ఉన్న జంట

ఆస్పత్రికి తరలించిన పోలీసులు

తప్పిన ప్రాణాపాయం

నూజివీడు : పట్టణంలోని సిలువగట్టు ప్రాంతంలో ఓ ప్రేమజంటపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని పోలీసులు బుధవారం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని మాడుగులపల్లికి చెందిన గల్లిపోగు సాల్మాన్‌రాజు (23) గతంలో నూజివీడు డీఏఆర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాడు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈనెల 7న పరీక్ష ఉంది. 5 తేదీనే నూజివీడు పట్టణంలోని అజరయ్యపేటలో ఉన్న తన మేనమామ కలపాల రామారావు ఇంటికి వచ్చాడు. ఇతనికి ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని (18)తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 6న పరీక్ష రాసిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 5.30 గంటల సమయంలో నూజివీడు బస్టాండ్‌ వద్దకు వచ్చింది. సాల్మాన్‌రాజు, విద్యార్థిని కలిసి సిలువగట్టు ప్రాంతానికి సాయంత్రం 6గంటల సమయంలో వెళ్లారు.

గట్టుపైన ఉన్న మేరీమాత గుడి వద్ద కూర్చొని ఉండగా దుండగుడు కట్టెదుంగతో వచ్చి డబ్బులు ఇవ్వాలని జంటను కోరాడు. వారు తమ దగ్గర లేవని సమాధానం చెప్పడంతో చేతిలో ఉన్న దుంగతో దాడి చేశాడు. విద్యార్థిని తన వద్ద ఉన్న రూ.3వేలు దుండగుడికి ఇచ్చింది. అవి తీసుకుని దుండగుడు వెళ్లిపోయాడు. వీరిద్దరూ దెబ్బలకు స్పృహతప్పి పడిపోయారు. బుధవారం ఉదయం 10గంటల సమయంలో కొందరు సిలువగట్టుపైకి ఎక్కుతుండగా అపస్మారక స్థితిలో ఉన్న జంట కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, సీఐ మేదర రామ్‌కుమార్‌ సందర్శించారు. దాడిచేసిన దుండగుడు ఎర్రగా, పిల్లికళ్లు కలిగి ఉన్నాడని బాధితులు చెపుతున్నారు. పట్టణ ఎస్‌ఐ–2 పీ ఏసుపాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు నెలల్లో రెండో సంఘటన
రెండు నెలల కాలంలో ఈ సంఘటన రెండోది కావడం గమనార్హం. ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ముసునూరు మండలానికి చెందిన జంట విజయవాడ నుంచి వస్తూ సిలువగట్టు వద్దకు వెళ్లగా దుండగుడు కర్రదుంగతో వ్యక్తి తలపై బలంగా కొట్టడంతో పడిపోయాడు. అతని వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌ బ్యాగ్, సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. మళ్లీ ఇదే తరహాలో సంఘటన ఇప్పుడు చోటుచేసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు