తప్పిపోయిన చిన్నారి చైల్డ్‌ ప్రొటెక్షన్‌కు అప్పగింత 

12 Apr, 2018 09:03 IST|Sakshi
తప్పిపోయిన బాలుడిని శిశు గృహ అధికారులకు  అప్పగించిన సీఐ జి.మధుబాబు

ఏలూరు టౌన్‌ : ఏలూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఒక  బాలుడిని ఒక వ్యక్తి చేరదీసి బంధువుల కోసం ఆరా తీశాడు. ప్రయోజనం లేకపోవటంతో ఆ బాలుడిని ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు.

బంధువుల సమాచారం తెలియకపోవటంతో బాలుడిని శిశు గృహకు తరలించారు. ఏలూరు పాత బస్టాండ్‌లో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో నాలుగేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా కనిపించాడు. ఏలూరు మరడాని రంగారావు కాలనీకి చెందిన కాటూరి వెంకన్న ఆ బాలుడిని గమనించి తన ఇంటికి తీసుకువెళ్లాడు.

బుధవారం ఉదయం మళ్లీ పాతబస్టాండ్‌కు తీసుకు వచ్చి వివరాలు ఏమైనా తెలుస్తాయని ఆశించాడు. రాత్రి వరకూ చూసినా ఎవరూ రాకపోవటంతో ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లి సీఐ జి.మధుబాబుకు అప్పగించారు.

వెంటనే ఆయన ఐసీడీఎస్‌ పీడీకి సమాచారం అందించి ఆయన ఆదేశాల మేరకు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌.రాజేష్‌ పోలీస్‌స్టేషన్‌కు రాగా,  ఆ బాలుడిని సీఐ మధుబాబు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు అప్పగించారు. బాలుడి చిరునామా తెలిసిన వారు ఏలూరు టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ మధుబాబు కోరారు.

మరిన్ని వార్తలు