ఆగని చీటింగ్స్‌!

10 Apr, 2020 10:55 IST|Sakshi

ఆపద సమయంలోనూ దయలేని సిటీజన్స్‌

మూడు కమిషనరేట్లలో పలు నేరాల్లో కేసులు నమోదు

మిస్సింగ్‌ కేసులూ పెద్ద సంఖ్యలోనే...

మద్యం దొరక్క వెళ్లిపోయిన వారే అధికం

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిపై కరోనా పడగ విప్పింది... ఏ రోజుకారోజు పెరుగుతున్న కేసులతో అందరిలోనూ ఆందోళన నెలకొంది... ఎవరికి వారు ఒక రోజు గడిచిందంటే బతుకు జీవుడా అనే భావనలో ఉన్నారు... అయినప్పటికీ కొన్ని రకాలైన నేరగాళ్లు మాత్రం ఆగట్లేదు. ఎవరికి వారు తమ ‘పని’ చేసుకుపోతున్నారు. ప్రధానంగా మిస్సింగ్స్, చీటింగ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక సైబర్‌ నేరాల విషయానికి వస్తే సాధారణ రోజులతో పోలిస్తే తగ్గినా... కొవిడ్‌ కేంద్రంగా నమోదయ్యేవి పెరిగాయి. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు సంబం«ధించి లాక్‌డౌన్‌ మొదలైన గత నెల 22–ఈ నెల 5  (ఆదివారం) మధ్య నమోదైన గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి నమోదైన కేసుల్లో అదృశ్యాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కేసుల వెనుక ఓ మతలబు ఉంది. మత్తు దొరక్క గడపదాటిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ కేసుల సంఖ్యను పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో పోలీసులకు కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి.

ఈ మత్తుకు బానిసలు అయిన అనేక మంది అది దొరకని పరిస్థితులు ఉండటంతో అదుపు తప్పుతున్నా రు. కొందరు ఆత్మహత్యలు, ఆ యత్నాలకు తెగబడుతుండగా... మరికొందరు పిచ్చిపిచ్చి గా ప్రవర్తించడం, ఇంట్లో సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోవడం వంటివి జరుగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో చీటింగ్‌ కేసులు ఉన్నాయి. అనేక రకాలుగా నమ్మించి ద్రోహం చేయడం, మోసం చేయడం వంటి వాళ్ళు కరో నా ఎఫెక్ట్‌ నేపథ్యంలోనూ తమ పంథా మార్చలేదు. వీటిలో కొన్ని మాత్రం నకిలీ శానిటైజర్లు, మాస్కుల తయారీకి సంబంధించి నమోదు చేసినవి ఉన్నాయి. పోలీస్టషన్ల మధ్య బారికేడ్లు, నిరంతర తనిఖీల నేపథ్యంలో చోరులకు అటు– ఇటు కదలడం ఇబ్బందికరంగా మారినట్లుంది. ఈ నేపథ్యంలోనే పగటి పూట చోరీలు కేవలం ఒక్కటే నమోదైంది. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ తాళం వేసున్న ఇళ్ళతో వీరికి వెసులుబాటు దొరుకుతోంది. ఫలితంగానే రాత్రి వేళల్లో జరిగే చోరీల సంఖ్య రెండంకెల్లో ఉంది. మూడు కమిషనరేట్లలోనూ కలిపి ఆరు అత్యాచారం కేసులు నమోదు కాగా... ఇవన్నీ సాంకేతికంగా ఆ నేరం కిందికి వచ్చినవి అయి ఉంటాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సరుకుల దుకాణాలు, ఇతర నిత్యావసర విక్రయ కేంద్రాల వద్ద ఘర్షణలు తదితరాలతో సాధారణ దాడి కేసులు నమోదవుతున్నాయి. అయితే మొత్తమ్మీద మూడు కమిషనరేట్ల పరిధిలోనూ నేరాల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 

మరిన్ని వార్తలు