బాలికల ఆచూకీ లభ్యం

6 Sep, 2019 09:47 IST|Sakshi
రాఘవాపురంలో అదృశ్యమైన బాలికలతో మాట్లాడుతున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత

రాఘవాపురంలో బుధవారం ముగ్గురు బాలికల అదృశ్యం

అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌లో బాలికల గుర్తింపు.. స్వగ్రామం తరలింపు

సాక్షి, చింతలపూడి (పశ్చిమ గోదావరి): చింతలపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. హైదరాబాద్‌లో బాలికలను గుర్తించినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎన్‌.స్నేహిత  తెలిపారు. గురువారం చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామం వెళ్లి డీఎస్పీ స్నేహిత బాలికలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాఘవాపురం గ్రామానికి చెందిన పగడాల ఐశ్వర్య, ఉమ్మడి దివ్య, ఉమ్మడి చిట్టి కలిసి బుధవారం ఉదయం స్కూల్‌కి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. సాయంత్రం స్కూల్‌ నుంచి ఇళ్లకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారన్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ పి.రాజేష్, ఎస్సై వి.క్రాంతికుమార్‌ల నేతృత్వంలో ఐదు బృందాలను ఏర్పాటు చేసి బాలికల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సత్తుపల్లిలోని సీసీ కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు. సత్తుపల్లితో పాటు ఖమ్మం, హైదరాబాద్‌ పోలీసులకు బాలికల ఫొటోలు అప్రమత్తం చేసినట్లు తెలిపారు. చివరికి హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో బాలికలను చూసిన ఒక వ్యక్తి సమాచారం అందించడంతో  బాలికలను చింతలపూడి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును 12 గంటల్లో చాకచక్యంగా పరిష్కరించిన చింతలపూడి పోలీసులను డీఎస్పీ అభినందించారు. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు