అమెరికాలో ఎంబీఏ విద్యార్థిని మృత్యువాత

17 Jan, 2020 14:24 IST|Sakshi

వాషింగ్టన్‌: గతేడాది డిసెంబరు 30న అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని శవమై తేలింది. ఆమె సొంత కారులో బ్లాంకెట్‌లో చుట్టబడిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివరాలు... గుజరాత్‌కు చెందిన అషరాఫ్‌ దాబావాలా ఇల్లినాయిస్‌లోని చౌంబర్గ్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు సురీల్‌ దాబావాలా(33) చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 30న ఆమె కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అషరాఫ్‌.. తన కూతురి జాడ చెప్పిన వారికి పది వేల డాలర్లు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండు వారాల తర్వాత సురీల్‌ మృతదేహం చికాగోలో అనుమానాస్పద పరిస్థితిలో బయటపడింది. సురీల్‌ కారు డిక్కీలో దుప్పటిలో చుట్టిన ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు ఓ ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీ తెలిపింది. సురీల్‌ కుటుంబం​ విఙ్ఞప్తి మేరకు ఆమె జాడను కనుగొన్నట్లు వెల్లడించింది. కాగా సురీల్‌ మరణానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు