హరన్‌ కుమార్‌ మిస్సింగ్‌.. విషాదాంతం

16 Jun, 2018 20:40 IST|Sakshi
హరన్‌ కుమార్‌ (పాత ఫోటో)

మిస్సోరీ: భారత సంతతి విద్యార్థి హరన్‌ కుమార్‌(17) మిస్సింగ్‌ కేసు విషాదాంతంగా ముగిసింది.  హరన్‌ మృతి చెందినట్లు ముస్సోరీ పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ‘హరన్‌ చనిపోయాడని ప్రకటిస్తున్నందుకు చింతిస్తున్నాం. అతని కుటుంబం కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాం’ అంటూ చెస్టర్‌ఫీల్డ్‌ పోలీస్‌ విభాగం అధికారికంగా ఓ ట్వీట్‌ చేసింది. సెయింట్‌ లూయిస్‌లో హరన్ కుటుంబం నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి తన వాహనంలో వెళ్లిన హరన్‌ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న చెస్టర్‌ఫీల్డ్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. అతను తరచూ వెళ్లే పార్క్‌, ప్రదేశాల్లో వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. బహుశా అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తొలుత ప్రకటించారు.

హర్వర్డ్‌ వెళ్లాల్సిన విద్యార్థి... 17 ఏళ్ల హరన్‌ కుమార్‌ పార్క్‌వే వెస్ట్‌ హైస్కూల్‌లో ఇటీవలె గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం హర్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ హిస్టరీ విభాగాన్ని అతను ఎంచుకున్నాడు. ఇంతలోనే ఇలా విగతజీవిగా మారాడు. హరన్‌ తరచూ డిప్రెషన్‌కి గురయ్యే వాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. అయితే హరన్‌ మృతికి గల కారణంపై పోలీసులు ఇంతదాకా స్పష్టత ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు