అదృశ్యం.. ఆపై అస్తిపంజరంగా..

4 Oct, 2019 10:58 IST|Sakshi
మృతురాలు రాధ(ఫైల్‌)

గత నెల 18న ఇంటి నుంచి వెళ్లిన రాధ

వ్యక్తిగత సంబంధం నేపథ్యంలో హత్య చేసిన గ్రామస్తుడు

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం

కాల్‌ డేటా ఆధారంగా కేసును ఛేదించిన ములుగు పోలీసులు

సాక్షి, ములుగు: భర్త మరణించిన అనంతరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఏర్పడిన వ్యక్తిగత సంబంధం మహిళ ప్రాణాలను బలికొంది. నమ్మిన వ్యక్తితో వెళ్లిన మహిళ అదే వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన ములుగు మండలంలోని జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టమ్మ ఆలయ పరిసర అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో విలేకరుల సమావేశంలో గురువారం కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపల్లి జీపీ పరిధిలోని కొడిశలకుంట గ్రామానికి నూనావత్‌ రాధ(45) భర్త సారయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు రాజుతో కలిసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రాధతో అదే గ్రామానికి చెందిన జాటోతు భోజ్యానాయక్‌ సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టాడు. గత నెల 18వ తేదీన రాధ భోజ్యనాయక్‌తో గట్టమ్మకు మొక్కులు చెల్లించడానికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆలయానికి కిలోమీటరు దూరంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంట తెచ్చిన స్కార్ప్‌తో రాధను హతమార్చాడు. 

ఆత్యహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. 
హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భోజ్యానాయక్‌ స్కార్ప్‌తో చెట్టుకు ఉరి వేసుకొని రాధ మృతి చెందినట్లుగా కట్టిపడేశాడు. అందరూ ఆత్మహత్యగా భావిస్తారని గుట్టుచప్పుడు కాకుండా స్వగ్రామానికి వెళ్లాడు.

ఫిర్యాదుతో..
తల్లి కనిపించకపోవడంతో కుమారుడు నూనవత్‌ రాజు గత నెల 28న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు రెండో ఎస్సై డీవీ ఫణీ నేతృత్వంలో పోలీసులు మృతురాలి కాల్‌ డేటాను సేకరించారు. చివరి రెండు రోజుల్లో భోజ్యానాయక్‌తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడు రాధను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భోజ్యానాయక్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన వెళ్లి చూడగా రాధ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారింది. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు. నిందితుడిపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో ఎస్సైలు బండారి రాజు, డీవీ ఫణీ పాల్గొన్నారు. 

రోధనలతో మిన్నంటిన గట్టమ్మ  గుట్ట 
రాధ మృతదేహం కుళ్లిపోయి అస్థిపంజరంగా దర్శనమివ్వడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. రోధలనతో గట్టమ్మ గుట్ట పరిసర ప్రాంతాలు మిన్నంటాయి. అస్థిపంజరం మాత్రమే ఉండడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే ఖననం చేశారు. 

మరిన్ని వార్తలు