షాబాద్‌లో అదృశ్యం..గుంటూరులో శవంగా ప్రత్యక్షం

20 Apr, 2018 09:35 IST|Sakshi
విష్ణువర్దన్‌రెడ్డి (ఫైల్‌) పీసరి విష్ణువర్దన్‌రెడ్డి మృతదేహం

యువకుడి అనుమానాస్పద మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

మృతుడిది షాబాద్‌ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామం

షాబాద్‌(చేవెళ్ల): షాబాద్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమైంది. షాబాద్‌ ఎస్సై  ఎం. రవికుమార్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... షాబాద్‌ మండలంలోని ఏట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన పీసరి విష్ణువర్ధన్‌రెడ్డి (26) ఈనెల 14న ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. రెండు రోజులు అతని కోసం వెతికిన కుటుంబసభ్యులు ఆచూకీ లభించకపోవటంతో ఈనెల 16న షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈనెల 18న గుంటూర్‌ జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ పాత ఇంట్లో చెట్టుకు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అతని వద్ద లభించిన ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన  విష్ణువర్దన్‌రెడ్డిగా అక్కడి పోలీసులు గుర్తించి ఇక్కడ పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన యువకుడి ఆచూకీ లభించిందని పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. అయితే యువకుడు గుంటూరు వరకు ఎందుకు వెళ్లాడనే కోణంలో.. అతని సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి వరకు స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు షాబాద్‌ ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు