కట్టుకున్నోడే కాలయముడు

12 Aug, 2018 01:00 IST|Sakshi
హత్య చేసిన ప్రాంతాన్ని చూపిస్తున్న హనుమంత్‌. (ఇన్‌సెట్‌లో) ప్రియాంక

అదృశ్యమైన ప్రియాంకది హత్యే 

మూడేళ్లు చిత్రహింసలు పెట్టి.. బావిలో పడేసిన వైనం

బావిలో ఎముకలు, కేశాలు, పుర్రె స్వాధీనం 

తొమ్మిదేళ్ల అనంతరం హత్యకేసు వెలుగులోకి..

నాంపల్లి (మునుగోడు): అవును ఆ తమ్ముడి అనుమానమే నిజమైంది. మూడేళ్లు అక్క ఆచూకీ కోసం ఆ సోదరుడు ఓ డిటెక్టివ్‌లా చేసిన పరిశోధన ఆఖరికి పోలీసుల సహకారంతో ఫలించింది. కట్టుకున్నోడే మూడేళ్లు చిత్రహింసలు పెట్టి.. ఆపై చిదిమేసి బావిలో పడవేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారిన ఓ హత్య కేసు మిస్టరీ తొమ్మిదేళ్ల అనంతరం వీడింది. వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన జంగయ్యకు ప్రియాంక (26.. అదృశ్యమైన నాటి వయసు), ఉపేందర్‌ సంతానం. బతుకుదెరువు నిమిత్తం జంగయ్య భార్య, బిడ్డలతో కలసి 2006లో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు వలస వెళ్లాడు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియాంకకు అక్కడే క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మర్రిగూడ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మోరా హనుమంతు పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమకు దారితీసింది.  

పెద్దలకు తెలియకుండా వివాహం 
హనుమంతు.. తన మాయమాటలతో ప్రియాంకను ప్రేమలోకి దింపి 2006లోనే వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రియాంకతో వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా హైదరాబాద్‌లోనే మకాం పెట్టాడు. వీరి దాంపత్యానికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు.  

కుమార్తె తనకు జన్మించలేదంటూ.. 
కొత్త జీవితం ప్రారంభించిన ప్రియాంక ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. కుమార్తె తనకు జన్మించలేదంటూ హనుమంతు భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. కుమార్తెను సాకలేనంటూ.. మరొకరికి ఇచ్చేద్దామని ఒత్తిడితెచ్చాడు. దీంతో అతడితో వేగలేకపోయిన ప్రియాంక అతడి ఒత్తిడికి తలొగ్గి కన్నపేగును హైదరాబాద్‌లోనే ఒకరికి దత్తత ఇచ్చేసింది. 

మూడేళ్లు నరకమే.. 
ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన ప్రియాంక జీవితం మూడేళ్ల పాటు నరకప్రాయంగానే సాగింది. భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా కుమారుడి కోసం బతుకు బండిని సాగించింది. అయినా, అతడిలో మానవత్వం లేకుండా పోయింది. గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నానని చెబుతూ పెద్దలు కుదిర్చిన మరో యువతితో వివాహం చేసుకుని రెండు నావలపై ప్రయాణం సాగించాడు. ప్రియాంక బాగోగులు చూడకుండా స్వగ్రామంలో ఎక్కువ కాలం గడుపుతుండేవాడు. దీంతో ప్రియాంక నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీనిని హనుమంతు తట్టుకోలేకపోయాడు. 

పథకం ప్రకారం.. 
ప్రియాంక తన సంతోషానికి అడ్డు తగులుతోందని, ఆమెను ఎలాగైనా అంతమొందించాలని హనుమంతు నిర్ణయించుకున్నాడు. అదను కోసం వేచి చూడటం ప్రారంభించాడు. 2009 చివరలో హనుమంతు రెండోభార్య, అతడి తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం ఊరెళ్లారు. ఇదే అదనుగా భావించిన హనుమంతు, ప్రియాంక వద్దకు వచ్చి మాయమాటలు చెప్పాడు. వ్యవసాయ పనులు చక్కబెట్టొద్దామంటూ కారులో మర్రిగూడ మండలం వెంకెపల్లికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి ఆమెతో గొడవపడి ప్లాస్టిక్‌ వైరుతో గొంతునులిమి అంతమొందించాడు. ఆపై గోనెసంచిలో మూటకట్టి కారు డిక్కీలో వేసుకుని, రాంరెడ్డిపల్లి శివారుకు తీసుకెళ్లి ఓ పడావుబావిలో పడవేశాడు. అనంతరం ప్రియాంకకు పుట్టిన కుమారుడిని కొండమల్లేపల్లికి చెందిన తన సమీప బంధువుకు ఇచ్చేసి అప్పటినుంచి రెండోభార్య, పిల్లలతో దర్జాగా జీవనం సాగిస్తున్నాడు. 

ఫేస్‌బుక్‌ ఆధారంగా.. 
2006 నుంచి కానరాకుండా పోయిన సోదరి ప్రియాంక కోసం ఉపేందర్‌ అన్వేషణ ప్రారంభించాడు. 2016లో ప్రియాంక, హనుమంతు, ఓ బాలుడితో దిగిన ఫొటో ఫేస్‌బుక్‌లో కనిపించడంతో పరిశోధన ప్రారంభించాడు. ఎట్టకేలకు తన సోదరితో ఉన్న వ్యక్తి మోరా హనుమంతుగా తెలుసుకుని వివరాలు సేకరించాడు. ఇటీవల మర్రిగూడ మండలం వెంకెపల్లికి చేరుకుని సోదరి ప్రియాంక గురించి ఆరా తీశాడు. స్థానికులు, ఘోరం జరిగిపోయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేయడంతో తట్టుకోలేకపోయాడు. 

ఎల్‌బీనగర్‌ పోలీసులను ఆశ్రయించి.. 
తన సోదరి హత్యకు గురైందనే అనుమానంతో ఉపేందర్‌ వెంటనే ఎల్‌బీనగర్‌ పోలీసులను ఆశ్రయించి తన పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలను బయటపెట్టాడు. అనంతరం అక్కడి పోలీసులు కేసును స్థానిక పోలీసులకు పురమాయించడంతో నాంపల్లి సీఐ ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. హనుమంతును రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. తమదైన పద్ధతిలో విచారణ సాగించగా హత్యోదంతం తీరును హనుమంతు వివరించాడు. 

ఎముకల వెలికితీత 
మోర హనుమంతు వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు శనివారం రాంరెడ్డిపల్లి శివారులోని పడావుబావిలో ఎముకలు సేకరించారు. తొమ్మిదేళ్ల క్రితం మృతదేహాన్ని మూటగట్టిన గోనెసంచి అవశేషాలు, నాడు హనుమంతు ప్రియాంక మృతదేహంతో పాటు పడవేసిన కారు మ్యాట్‌ను, పుర్రె, ఎముకలు, కేశాలు, ప్లాస్టిక్‌ చెప్పులు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు, కేశాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్టు సీఐ ప్రభాకర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు