20 రోజుల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు

15 Jan, 2020 13:38 IST|Sakshi

ఎట్టకేలకు రోహిత ఆచూకీ లభ్యం

సాక్షి, హైదరాబాద్‌: 20 రోజుల కింద అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రోహిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది.  ఆమె కోసం గత కొన్నిరోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. పుణెలో రోహిత ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ కలహాలతోనే రోహిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రంలోపు ఆమెను పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారని, ఇక్కడికి తీసుకొచ్చాక కుటుంబ సభ్యులకు ఆమెను పోలీసులు అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే, రోహిత పుణె నుంచి రావడానికి ఇష్టపడటం లేదని, అక్కడ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె తిరిగి హైదరాబాద్‌ రావాలనుకోవడం లేదని సమాచారం. హైదరాబాద్‌ నుంచి వెళ్లేముందు ఆమె తన ఏటీఎం కార్డు నుంచి రూ. 80వేలు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు.



చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన రోహిత నానక్‌రాంగూడలోని ఆపిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటోంది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని మంత్రి సెలెప్టియా అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. గత డిసెంబర్‌ 26న మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. సెల్‌ ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో డిసెంబర్‌ 29న ఆమె సోదరుడు పరిక్షిత్‌ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఐడీ కార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను ఫ్లాట్‌లోనే వదిలి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనుగొన్నారు.
చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కోసం ముమ్మర గాలింపు

మరిన్ని వార్తలు