ప్రొఫెసర్‌ మురుగన్‌ అరెస్ట్‌

24 Apr, 2018 07:44 IST|Sakshi

మరో ఇద్దరి కోసం గాలింపు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేసులో కీలకమలుపు

విడాకులకుదరఖాస్తు చేసిన నిర్మలాదేవి భర్త

సాక్షి ప్రతినిధి, చెన్నై: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కీలక వ్యక్తుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ మురుగన్‌ను సీబీసీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాళాల విద్యార్థినులను యూనివర్సిటీ పెద్దల లైంగిక అవసరాలకు ప్రలోభపెట్టి అరెస్టయిన నిర్మలాదేవి కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మలాదేవిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నిర్మలాదేవి వద్ద జరిపిన విచారణలో పలువురు వీవీఐపీలు, వీఐపీలు పాత్ర ఉన్నట్లు తేలింది. వారిలో మదురై యూనివర్సిటీ మానవవనరుల శాఖ సంచాలకులు కలైసెల్వన్, సహాయక ప్రొఫెసర్లు మురుగన్, కరుప్పుస్వామిలను విచారించాలని నిర్ణయించారు.

వారిలో కలైసెల్వన్‌ ఆదివారం విచారణకు హాజరుకాగా తమ కస్టడీలోనే ఉంచుకుని విచారిస్తున్నారు. కలైసెల్వన్‌ను సైతం అరెస్ట్‌ చేస్తారనితెలుస్తోంది. మిగిలిన ఇద్దరూ గత నాలుగురోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు తీవ్రతరం చేశారు. తిరుచ్చిళి సమీపం నాడాకుళం గ్రామంలోని కరప్పుస్వామి ఇంటిలో భార్య, బంధువులను పోలీసులు విచారించారు. మధురై అరుప్పుకోట్టైలోని బంధువుల ఇంటిలో గాలింపు చేపట్టారు. నాలుగురోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మురుగన్‌ యూనివర్సిటీలోని అటెండెన్స్‌ రిజిస్టరులో సంతకం చేసేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావడంతో పోలీసు అధికారులు చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు. ఓపిగ్గా వేచిచూస్తే నిజాలు బయటకు వస్తాయని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ చెల్ల దురై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రెండోసారి భర్త విడాకుల పిటిషన్‌
నిర్మలాదేవితో తెగదెంపులు చేసుకోవాలని విడాకులకు సిద్ధమైన భర్త గతంలో నోటీసులు పంపారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అప్పట్లో విరమించుకున్నారు. అయితే నిర్మలాదేవి వివాదాల్లో కూరుకుపోవడంతో రెండురోజుల క్రితం విడాకులు కోరుతూ ఆయన మరోసారి దరఖాస్తు చేశారు.

కాంట్రాక్టులోనూ అక్రమాలు
తన భర్త కోసం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సైతం నిర్మలాదేవి అక్రమాలకు పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో సీబీసీఐడీ అధికారులు ముగ్గురు కాంట్రాక్టర్లును కూడా పిలిచి విచారిస్తున్నారు. అరుప్పుకోట్టై అత్తిపట్టులోని నిర్మలాదేవి ఇంట్లో ఏడుగురితో కూడిన సీబీసీఐడీ అధికారుల బృందం ఆదివారం ఆరుగంటలపాటు తనిఖీలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, సీడీలు మూడు సంచుల నిండా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఇంటికి సీలువేశారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పేర్లను కనుగొన్నారు. నిర్మలాదేవి భర్త శరవణపాండియన్‌ ప్రభుత్వ కాంట్రాక్టరు కావడంతో కాంట్రాక్టులను పొందేందుకు వీరి సిఫార్సులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా సదరు ప్రభుత్వ అధికారులను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు