బెంట్లీ కారుతో విధ్వంసం

12 Feb, 2020 10:22 IST|Sakshi
మహ్మద్‌ నలపాడ్‌ డ్రైవింగ్‌ చేసిన కారు బెంట్లీ కారు ,నలపాడ్‌

ఎమ్మెల్యే తనయుడు మహ్మద్‌ నలపాడ్‌ పనే  

పట్టించిన సీసీ కెమెరాల చిత్రాలు  

నోటీసులు పంపిన పోలీసులు

కర్ణాటక, బొమ్మనహళ్లి:  ఆదివారం నగరంలోని మేక్రి సర్కిల్‌ వద్ద వరుసగా వాహనాలను ఢీకొట్టి, అక్కడే వదిలివెళ్లిన అత్యంత ఖరీదైన బెంట్లీ కారు ఎవరిదనేది పోలీసులు గుర్తించారు. ఈ కారును డ్రైవింగ్‌ చేస్తు ప్రమాదానికి కారణమైన వ్యక్తి బెంగళూరు శాంతి నగర నియోజకవర్గం ఎమ్మెల్యే హ్యారిస్‌ కుమారుడు అయిన మహ్మద్‌ నలపాద్‌గా గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటతో పాటు చట్టుపక్కల సిసి కెమెరాల్లో నమోదైన చిత్రాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. దాంతో విచారణకు  హాజరు కావాలని పోలీసులు నలపాడుకు నోటిసు జారి చేసినట్లు డీసీపి రవికాంతెగౌడ తెలిపారు. ఈ ప్రమాదంపై  ఇప్పటికే నగరంలోని సదాశివర నగర పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

ఏం జరిగింది  
నలపాద్‌కు వివాదాల్లోకి దిగడం కొత్త కాదు. గతంలో ఓ కేఫ్‌లో యువకున్ని తీవ్రంగా కొట్టి కొన్ని నెలల పాటు సెంట్రల్‌ జైలులో రిమాండు అనుభవించడం తెలిసిందే. తాజాగా ఆదివారం మేక్రిసర్కిల్‌ వద్ద ఉన్న అండర్‌ పాస్‌లో బెంట్లి కారులో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనంతో పాటు ఆటోను ఢీకొన్నారు. దీంతో బైకిస్టు కాలు విరిగిపోగా, ఆటో పూర్తిగా డ్యామేజీ అయింది. కారు డ్రైవర్‌  అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడ వదలి వెళ్ళి పోవడం జరిగింది. 

ఆధారాలున్నాయి: డీసీపీ గౌడ
ఈ ప్రమాదం కేసులో తానే డ్రైవింగ్‌ చేశానని ఒక వ్యక్తి వచ్చి పోలీసుల వద్ద లొంగిపోయాడు. అయితే పోలీసులు జరిపిన విచారణలో ఈ వ్యక్తి డ్రైవింగ్‌ చేయలేదని తేలింది. మహ్మద్‌ నలపాడ్‌ నడిపాడని గుర్తించి కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. నోటిసులు అందిన వెంటనే విచారణకు హాజరు కావాలి. రానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ రవికాంతేగౌడ అన్నారు.కారును నడిపింది నలపాడేనని ఆధారాలు ఉన్నాయని, హాజరుకాక పోతే తాము కోర్టులో ఆధారాలను ప్రవేశ పెడతామని తెలిపారు.  ప్రమాద సమయంలో అతడు జారుకున్నాడు. కానీ  స్నేహితుడు నఫి మహ్మద్‌నసీర్, అతని బాడిగార్డ్‌ బాలకృష్ణలను స్థానికులు గుర్తించారు. పలు చోట్ల ట్రాఫిక సిగ్నల్స్‌ వద్ద సిసి కెమరాల్లో నలపాడు కారు నడుపుతున్నట్లు రికార్డయింది. 

చిన్న ప్రమాదమే: దినేష్‌ గుండూరావు  
కాగా, ఇది ఒక చిన్న ప్రమాదం అని దానిని పెద్దగా చేయ వద్దని కేపిసిసి అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు అన్నారు. కేపీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. కానీ కొంత మంది పని కట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కుమారుడైనా, ఇతరులైనా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు.   

మరిన్ని వార్తలు