థియేటర్‌లో అధిక రేట్లు.. మేనేజర్‌ను చితక్కొట్టారు..

29 Jun, 2018 16:13 IST|Sakshi

పూణే : మల్టీఫ్లెక్స్‌లో ఆహార పదార్థాలను అధిక రేట్లకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన(ఎమ్‌ఎన్‌ఎస్‌) కార్యకర్తలు అసిస్టెంట్‌ మేనేజర్‌పై దాడి చేశారు. అధిక రేట్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతన్ని చావబాదారు. ఈ ఘటన శుక్రవారం పూణేలోని ఓ మల్టీఫ్లెక్స్‌లో చోటు చేసుకుంది. కాగా, థియేటర్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌పై దాడి చేసిన వారిలో మాజీ కార్పొరేటర్‌ కూడా ఉన్నారు.

దాడికి పాల్పడిన వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సేనాపతి బాపత్‌ రోడ్‌లోని పీవీఆర్‌ ఐకాన్‌ మల్టీఫ్లెక్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన మాజీ కార్పొరేటర్‌ షిండే.. థియేటర్లలో అధిక రేట్లకు ఆహార పదార్థాలను అమ్మడంపై హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.

అధిక రేట్లకు ఆహారపదార్థాలను అమ్ముతున్నారని, అలా చేయకుండా అరికట్టాలని ప్రభుత్వానికి కోర్టు చేసిన సూచనలను షిండే గుర్తు చేశారు. అన్ని థియేటర్లకు వెళ్లినట్లే పీవీఆర్‌ ఐకాన్‌కు కూడా వెళ్లామని తెలిపారు. అధిక రేట్ల గురించి మల్టీఫ్లెక్స్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌తో మాట్లాడగా ఆయన ’డబ్బులు ఉన్నవాళ్లే థియేటర్‌కు రావాలి. భరించలేని వాళ్లు థియేటర్‌కు రావొద్దు.’అని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

దీనిపై అసిస్టెంట్‌ మేనేజర్‌తో వాగ్వాదం జరిగిందని, దీంతో కొందరు ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు అతనిపై చేయి చేసుకున్నారని వెల్లడించారు. కాగా, ముంబైలో సినిమా టికెట్ల రేట్ల కంటే అక్కడ అమ్మే ఆహార పదార్థాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి.

మరిన్ని వార్తలు