‘సోషల్‌’ కిల్లింగ్స్‌!

28 May, 2018 02:26 IST|Sakshi

పక్షం రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వదంతులు

చెదురుమదురు ఘటనలతో అట్టుడుకుతున్న నగరం

ఇద్దరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, మరికొందరికి గాయాలు

  • బుధవారం పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడిపై విరుచుకుపడిన జనం.. 
  • అదే రోజు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని బీబీనగర్‌లో ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేసిన స్థానికులు.. 
  • శుక్రవారం మల్కాజ్‌గిరి ఠాణా పరిధిలో కాలకృత్యాలు తీర్చుకుంటున్న వ్యక్తికి చావుదెబ్బలు.. 
  • శనివారం చాంద్రాయణగుట్ట, మాదన్నపేటల్లో ఎనిమిది మందిపై దాడి, ఒకరి మృతి.. 

సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్ల కారణంగా రాజధానిలో జరిగిన బీభత్సమిది. వాట్సాప్‌లో షేర్‌ అవుతున్న వీడియోలు, ఫొటోలు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా యి. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు, పిల్లల కిడ్నాపర్లు వచ్చారని, ఫలానా చోట ఒకరు చిక్కారని, మరికొందరు ఇంకా సంచరిస్తున్నారనేది వాటి సారాంశం. వీటి ప్రభావంతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కాస్త అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా దాడులకు తెగబడుతున్నారు. శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే చంద్రయ్య(52) అనే హిజ్రా ప్రాణం తీయగా, మరో ముగ్గురిని క్షతగాత్రులుగా మార్చింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాదన్నపేట ఠాణా పరిధిలో నలుగురు వ్యక్తులపై దాడికి కారణమైంది. –సాక్షి, హైదరాబాద్‌

ఇతర దేశాలకు చెందిన పాత వీడియోలే.. 
ఈ పుకార్లతో పాటు షేర్‌ అవుతున్న వీడియోలు అత్యంత భయంకరంగా, జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవి కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. ఇరాన్, ఇరాక్, సిరియా, మయన్మార్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌ తదితర ప్రాంతాల్లో గతంలో చోటు చేసుకున్న దారుణాలకు సంబంధించిన వీడియోలను కొందరు ఇంటర్నెట్‌ నుంచి తీసి షేర్‌ చేస్తున్నారు. కొన్ని వీడియోలకు తెలుగు, హిందీ, ఉర్దూ ఆడియో క్లిప్స్‌ జోడిస్తున్నారు. వీటి ప్రభావానికి లోనవుతున్న సాధారణ ప్రజలు ప్రతి అంశాన్నీ అనుమానాస్పదంగా చూస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోంది. 

ఆధ్యుల్ని గుర్తించడం సాధ్యం కావట్లే.. 
ఇలాంటి వీడియోలను షేర్‌ చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తిస్తున్నప్పటికీ.. వీటికి మూలం ఎవరనేది తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఈ పుకార్లు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమై రాష్ట్రంలోకి విస్తరించినట్లు భావిస్తున్నారు. వీటిని షేర్‌ చేసిన వారిలో కొందరిని అరెస్టు చేసిన పోలీసులు సోషల్‌మీడియా సెల్‌ ద్వారా సూత్రధారుల్ని గుర్తించాలని ప్రయత్నాలు చేశారు. చివరకు వాట్సాప్‌ సంస్థను సంప్రదించినా మూలం ఎవరనే వివరాలు చెప్పడం సాధ్యం కాదని చేతులెత్తేసింది. దీంతో షేరింగ్‌ ద్వారా విస్తరణను అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 

ఆ ‘ఇద్దరే’ ప్రధాన టార్గెట్‌.. 
పుకార్ల ప్రభావంతో ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్న సాధారణ ప్రజలు ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా దాడులకు తెగబడుతున్నారు. వీరికి టార్గెట్‌గా మారుతున్న వారిలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, మానసిక వికలాంగులే ఎక్కువగా ఉంటున్నారు. రాజధానిలో వృత్తి, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. వీరిని స్థానికులు ప్రశ్నించినప్పుడు భాష అర్థం కాక సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానం పెరిగి, విచక్షణ కోల్పోతున్న ప్రజలు వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇక మానసిక వికలాంగులు సైతం వీరికి టార్గెట్‌గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 

స్కూళ్లు తెరిస్తే మరింత ప్రమాదం.. 
ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. మరో వారంలో స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ పుకార్ల కారణంగా పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లు, ప్రిన్సిపాల్స్, పేరెంట్స్‌ అసోసియేషన్లతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. పుకార్లను తిప్పికొట్టడానికి నగర పోలీసు విభాగం సైతం సమాయత్తమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో దాదాపు ప్రతి పోలీసుస్టేషన్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలు ఉన్నాయి. కమ్యూనిటీ పోలీసింగ్‌ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా ఇలాంటి పుకార్లను సమర్థంగా తిప్పికొట్టడానికి నిర్ణయించారు. 

ఇతర కోణాలు ఉన్నాయా..? 
సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం వెనుక వేరే కోణాలు, కారణాలు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టు కుని లోతుగా ఆరా తీయడానికి స్పెషల్‌ బ్రాంచ్‌ను రంగంలోకి దింపడంతో పాటు నిఘా వర్గాల సహకా రం తీసుకుంటున్నారు. ప్రధానంగా పుకార్లు విస్తరిస్తున్న సోషల్‌ మీడియా గ్రూపులు, అవి విస్తరిస్తున్న ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఈ పుకార్లు నమ్మవద్దంటూ, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, తమకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఓ వాయిస్‌ క్లిప్‌ విడుదల చేశారు. 1.45 నిమిషాల నిడివితో ఉన్న దీనితో పాటు ఆయన సందేశానికి సంబంధించిన టెక్ట్స్‌ను అన్ని గ్రూపుల్లోనూ ప్రచారం చేస్తున్నారు.

ఆధారాలు దొరికితే అడ్మిన్‌ అరెస్టే..

నగరంలో ఎలాంటి అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, దోపిడీ ముఠాల సంచా రం లేదు. సోషల్‌మీడియాలో ప్రచారమంతా వదంతులే. కిడ్నాపింగ్, దోపిడీ ముఠాలు వచ్చాయన్న ప్రచారం ఉద్రిక్తతతలకు దారితీయడమే కాక పరిస్థితులు చేయి దాటేలా చేస్తోంది. ప్రజా జీవితానికి భంగం కలిగించే ఇలాంటి వదంతులను ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్‌ చేసిన వారితో పాటు ఆ యా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్‌మీడియాపై పూర్తి నిఘా ఉంచాం. ఆధారాలు చిక్కితే గ్రూప్‌ అడ్మి న్స్‌నూ అరెస్టు చేస్తాం. చాంద్రాయణగుట్ట ఉదంతానికి సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నాం. తాజా పరిణామాల నేపథ్యంలో తెల్లవారుజామున 2 గంటల వరకు పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూకోల్ట్స్‌ సంచరిస్తూనే ఉంటాయి. 
    

– అంజనీకుమార్, హైదరాబాద్‌ కొత్వాల్‌  

మరిన్ని వార్తలు