దారుణంగా మూక దాడి

7 Feb, 2020 17:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఆరుగురు రైతులను గ్రామస్తులు దారుణంగా చితకబాదారు. కర్రలు, దుంగలతో కొట్టడమే కాకుండా వారిపైకి పెద్ద పెద్ద బండరాళ్లను విసిరారు. రైతులు వచ్చిన రెండు కార్లను ధ్వంసం చేశారు. వారిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లాయ్‌ వరకు తరిమి తరిమి కొట్టారు. వారిలో ఒక రైతు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఖిరికియా గ్రామంలో బుధవారం ఈ దారుణ సంఘటన జరగ్గా పోలీసులు గురువారం 15 మంది నిందితులను అరెస్ట్‌ చేసి వారిపై హత్యానేరం మోపారు. 

ఈ సంఘటనను స్థానిక జర్నలిస్ట్‌ ఒకరు వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా, ఇప్పుడది వైరల్‌ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం పొరుగూరికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఖిరికియా గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలకు అడ్వాన్స్‌ కింద లక్షా యాభై వేల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకొని పనికి రాకుండా ఎగ్గొడుతున్న ఆ కూలీలను డబ్బులన్నా ఇవ్వాల్సిందిగా రైతులు కోరారు. తమ ఊరికొస్తే డబ్బులిస్తామని కూలీలు వారికి నచ్చ చెప్పారు.

వారి మాటలు నమ్మి గ్రామానికి వచ్చిన ఆరుగురు రైతులను ఊరు శివారున ముగ్గురు కూలీలు మరికొందరితో కలిసి అడ్డుకొని కొట్టడం ప్రారంభించారు. ఇదేమిటని అక్కడికొచ్చిన గ్రామస్తులు అడగ్గా, పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగలంటూ కూలీలు అబద్ధమాడారు. దాంతో మరికొంత మంది గ్రామస్తులు ఆ కూలీలతో చేతులు కలిపి రైతులను చితకబాదారు. అక్కడ గుమికూడిన ప్రజలంతా చోద్యం చూస్తున్నట్టుగా చూస్తూ తమ తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి మాత్రం ముక దాడిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం 40మందిపై కేసు నమోదు కాగా, ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

మరిన్ని వార్తలు