సిమ్‌ బ్లాక్‌.. ఖాతాకు షాక్‌

15 Nov, 2018 12:00 IST|Sakshi

నకిలీ పత్రాలతో ఇతరుల నంబర్లతో  సిమ్‌కార్డుల కొనుగోలు  

వాటితో మొబైల్, నెట్‌ బ్యాంకింగ్‌  

ఖాతాల నుంచి సొమ్ము స్వాహా  

బెంగళూరులో మరో కొత్త     సైబర్‌ క్రైంలు  

రామనాథ్‌ బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆన్‌లైన్, మొబైల్‌ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇటీవల నాలుగురోజులు ఆయన సిమ్‌ పనిచేయలేదు. ఏదో సమస్య వచ్చిందిలే అనుకుని మరో ఫోన్‌ వాడారు. కొద్దిరోజులకు బ్యాంకు బ్యాలెన్స్‌ చూసుకుంటే భారీగా తేడా కనిపించింది. అయ్యో అనుకుంటూ బ్యాంకుకు వెళ్తే లావాదేవీల వివరాలన్నీ మీ సిమ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. కానీ అతని సిమ్‌ నంబరుతో మరొకరు అప్పటికే సిమ్‌ తీసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నట్లు తేలింది. ఈ తరహా నేరాలు ఇప్పుడు పెరుగుతున్నాయి.   

కర్ణాటక, బనశంకరి:సైబర్‌ నేరాల అడ్డుకట్టకు బ్యాంకులు, పోలీసు సైబర్‌ క్రైమ్‌ విభాగాలు ఎన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రజల కష్టార్జితానికి భద్రత ఇవ్వలేకపోతున్నారు. ఆన్‌లైన వంచకులు రోజురోజుకు విస్తరిస్తున్న సాంకేతికతను వినియోగించుకుంటూ కొత్త తరహా పద్ధతుల్లో ప్రజల ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులకు ఫోన్‌లు చేసి తమను తాము బ్యాంకు ప్రతినిధులుగా పరిచయం చేసుకొని లేదా లాటరీ వచ్చిందని, విదేశాల నుంచి బహుమతులు వచ్చాయని అందుకు డబ్బులు చెల్లించాలంటూ ఖాతాదారులను నమ్మించి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం లేదా డబ్బు డిపాజిట్‌ చేయించుకుంటూ దోచుకునేవారు. బ్యాంకులు, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మరోవైపు ఇటువంటి మోసాలపై ప్రజలకు కూడా అవగాహన కలగడంతో సైబర్‌ క్రైమ్‌ నిందితులు రూటు మార్చారు. 

మొబైల్‌ బ్యాంకింగ్‌దారులే లక్ష్యం  
తాజాగా సైబర్‌ వంచకులు మొబైల్‌సిమ్‌ స్వైపింగ్‌ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌బ్యాంకింగ్‌ వ్యవహారాలను నిర్వహించేవారి మొబైల్‌ సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేసి అవే నంబర్లతో కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసి అకౌంట్లకు కన్నం వేస్తున్న నేరాలు వెలుగుచూస్తున్నాయి. సిమ్‌ స్వైపింగ్‌ లేదా సిమ్‌ క్లోనింగ్‌ పేరుతో కొత్తమార్గాలను సైబర్‌ నేరగాళ్లు అన్వేషిస్తుండటంతో పోలీసులకు సవాల్‌గా మారుతోంది. 

ఇప్పటికి 12 కేసులు వెలుగులోకి  
నగరంలో దీనిపై ఇప్పటివరకు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు హరీశ్‌ అనే వంచకుడిని అరెస్ట్‌ చేశారు. నకిలీ పత్రాలు అందించి సిమ్, బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచిన నేపథ్యంలో వంచకుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారుతోందని సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యశవంతకుమార్‌ తెలిపారు.  

మోసం జరుగుతుంది ఇలా  
ఈ మోసాలకు ఎలా పాల్పడతారంటే... నెట్‌ బ్యాంకింగ్‌ ఉన్న బ్యాంకు కస్టమర్లు మొబైల్‌ నెంబర్‌ తీసుకున్న తరువాత గుర్తింపు కార్డు దొంగలించి నకిలీ ఐడీ కార్డు సృష్టిస్తారు. ఎప్పుడైనా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మూడు నాలుగు రోజుల వరుస సెలవుల సమయంలో సిమ్‌ పోయిందని తెలిపి నకిలీ ఐడీకార్డు అందించి కొత్త సిమ్‌ సంపాదిస్తారు. దీంతో కస్టమర్లు అసలు సిమ్‌కార్డు బ్లాక్‌ అవుతుంది. వరుస సెలవులు ఉన్నందున కస్టమర్లు విచారించడానికి వెళ్లినా సిమ్‌ దుకాణాలు తెరిచి ఉండవు. ఈ సమయంలో వంచకులు సిమ్‌ ఆక్టివ్‌ చేసుకుని నెట్‌బ్యాంకింగ్‌కు లాగిన్‌ అవుతారు. ఓటీపీ కొత్త సిమ్‌ రావడం, మోసగాళ్లు జనం బ్యాంక్‌ అకౌంట్ల నుంచి నగదు దోచుకోవడం జరిగిపోతుంది.  

మోసపోతున్న బాధితులు  
కస్టమర్లు సిమ్‌కార్డు బ్లాక్‌ చేయడం పట్ల సిమ్‌కార్డు దుకాణం వద్ద కు వెళ్లి విచారించినప్పటికీ ఈ సమయంలో ఏమి జరిగింది అనేది తెలీదు. దీంతో ఎలాంటి అనుమానం లేకుండా మరో కొత్త సిమ్‌ కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. కానీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వచ్చినప్పుడు మాత్రమే వంచన వెలుగులోకి వస్తుంది. అంతలోగా సైబర్‌నేరగాళ్లు కస్టమర్లు అకౌంట్లులో ఉన్న నగదు నొక్కేస్తారు.  

సిమ్‌ బ్లాక్‌ అయితేజాగ్రత్త   
ఒక్కసారిగా సిమ్‌కార్డు బ్లాక్‌ అయితే ఏదో జరగరానిది జరిగిందని అనుమానించాలి.  
సిమ్‌ ఆపరేటర్‌ దుకాణానికి వెళ్లి ఫిర్యాదు చేయాలి.  
బ్యాంకుకు వెళ్లి ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌ను బ్లాక్‌ చేయించండి. లావాదేవీల ఎస్‌ఎంఎస్‌లను మరో సిమ్‌ నంబరుకు మార్చుకోవడం చేయాలి.  
పాత సిమ్‌ను తొలగించి అదే నంబరుతో కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేయాలి.

మరిన్ని వార్తలు