ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌ నుంచి 150 మొబైల్స్‌ చోరీ

21 Feb, 2019 09:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 150 మొబైల్స్‌ చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని అలీపూర్‌ ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ హబ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్‌ హబ్‌ సెక్యూరిటీ అధికారి మాన్‌సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిబ్రవరి 19వ తేదీన మొబైల్‌ ఫోన్లను డెలీవరి హబ్‌ నుంచి బిలాస్‌పూర్‌లోని వేర్‌హౌస్‌కు తరలించే క్రమంలో ఈ చోరీ జరిగినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాన్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ముఠా నాయకుడు సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌లు ఉన్నారు. 

ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితులు.. పలు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 30 కొత్త ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ కేసులో సంతోష్‌, బ్రీజ్‌మోహన్‌లపై అక్కడి ఫర్సత్ గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయిందని తెలిపారు.

మరిన్ని వార్తలు