మానవమృగం

20 Jun, 2019 03:14 IST|Sakshi
నిందితుడు ప్రవీణ్‌

9 నెలల పసిగుడ్డుపై అత్యాచారం.. ఆపై హత్య 

హన్మకొండలోని కుమార్‌పల్లిలో ఘటన 

పోలీసుల అదుపులో నిందితుడు 

హన్మకొండ చౌరస్తా: మానవత్వమే కన్నీరు పెట్టింది. తాను మనిషిని అని మరిచిన ఓ మృగం అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండలోని కుమార్‌పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం. రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. పాప ఆధార్‌ కార్డు నమోదు కోసం ఈనెల 17న కూతురుని తీసుకుని హన్మకొండలోని తల్లిగారింటికి రచన భర్త జగన్‌తో వచ్చింది. మరుసటి రోజు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లగా జనం అధికంగా ఉండటంతో మరుసటి రోజు రావాలని నిర్వాహకులు సూచించారు. అయితే జగన్‌కు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో భార్య, కుమార్తెను ఇక్కడే ఉంచి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. 

అర్ధరాత్రి అపహరణ 
రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్‌ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్‌లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్‌ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్‌ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
హన్మకొండ జంక్షన్‌లో ఆందోళన చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, శ్రీహిత (ఫైల్‌) 

ఆస్పత్రికి తీసుకెళ్లగా.. 
చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. పంచనామా చేసిన హన్మకొండ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

రెండు నెలల క్రితం చితకబాదారు 
నిందితుడు వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం వసంతపూర్‌కు చెందిన పోలెపాక ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా హన్మకొండ కుమార్‌పల్లిలో అద్దె గదిలో ఉంటూ స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన ప్రవీణ్‌..మత్తులో సైకోగా మారుతాడని తెలిసింది. రెండు నెలల క్రితం అర్ధరాత్రి ఓ ఇంట్లో నిద్రిస్తున్న దంపతుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తుండటంతో గమనించిన స్థానికులు చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు చెబుతున్నారు.  

హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన 
పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోస్టుమార్టం చేయనిచ్చేది లేదని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఎంజీఎం మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే.. హన్మకొండ జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు.  

కఠిన చర్యలు తీసుకోండి
ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

అత్యాచారం చేసి ఆపై హత్య 
ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి 
ఎంజీఎం : శ్రీహిత మృతదేహానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్‌ రజాం అలీఖాన్‌ వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి తలపై రెండు ప్రదేశాల్లో గాయాలైనట్లు నిర్ధారించారు. 

మరిన్ని వార్తలు