బధిర యువతిపై లైంగికదాడికి యత్నం

9 Feb, 2019 13:26 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న పోలీసులు

తల్లి పక్కనుండగానే యువతిని ఎత్తుకెళ్లిన యువకుడు

యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానిక మహిళలు

కృష్ణాజిల్లా, పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): మూగ యువతిపై ఓ యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు ఆదిఆంధ్రా కాలనీకి చెందిన లింగాల దీనమ్మ  పందొమ్మిది సంవత్సరాల కుమార్తె (పుట్టు మూగ, చెవుడు)ను తీసుకుని శుక్రవారం సాయంత్రం ప్రత్తిపాడులోని వస్త్ర దుకాణానికి వెళ్లింది. దుస్తులు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఆదిఆంధ్రా కాలనీకి వెళ్లే దారిలోని గోల్‌బావి వద్ద అదే గ్రామంలోని వీఆర్వో కాలనీ (మాలపల్లె)కు చెందిన నామా కల్యాణ్‌కుమార్‌ (19) వారిని వెంబడించాడు. మార్గమధ్యలో నిర్జన ప్రదేశంలో తల్లీ, కూతుళ్లను అడ్డగించి తల్లిని పక్కకు తోసేశాడు. మూగ యువతిని బలవంతంగా భుజంపైకి ఎత్తుకుని పక్కనున్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో పాలుపోని తల్లి దీనమ్మ నడి రోడ్డుపైనే కూర్చుని హాహాకారాలు చేసింది. అదే సమయంలో అటువైపుగా వ్యవసాయ పనులకు వెళ్లి ఆటోలో వస్తున్న మహిళా కూలీలు, ప్రజలు గమనించారు. దీనమ్మ వారికి విషయాన్ని వివరించింది. దీంతో మహిళలు కేకలు వేస్తూ కల్యాణ్‌ని వెంబడించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడ్ని పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన..
అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలంటూ గొట్టిపాడు ఆదిఆంధ్రా కాలనీకి చెందిన మహిళలు, కాలనీ వాసులు రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద ఎత్తున ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషనుకు చేరుకున్నారు. యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కాలనీ వాసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. యువకుడ్ని ఉపేక్షించబోమంటూ ఎస్‌ఐ ఏ బాలకృష్ణ వారికి నచ్చజెప్పారు. విషయం తెలుసుకున్న గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ కే ప్రకాష్‌బాబు ప్రత్తిపాడు వచ్చి బాధిత తల్లీకూతుళ్లతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తల్లి దీనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేబ్రోలు సీఐ నరేష్‌కుమార్‌           పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు