అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరం

20 Jan, 2020 09:44 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, నాయకులు

పోలీసుల అదుపులో నిందితుడు

బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించిన పరిగి ఎమ్మెల్యే

సీడీపీఓ అధికారులను ఆరా తీసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి

రంగారెడ్డి, పరిగి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం అర్ధరాత్రి పరిగిలోని బీసీ కాలనీలో ఈ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీసీ కాలనీలో నివసించే సాయి (24) అదే కాలనీలో నివసించే బాలిక (11)పై కన్నేసి శనివారం రాత్రి 10 గంబాలికను తన వెంట తీసుకెళ్లాడు. బాలికను ఇంటికి కొంతదూరంలో ఉన్న ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక ఏడుస్తూ ఇంటికొచ్చి జరిగిన విషయం చెప్పింది. వెంటనే చుట్టుపక్కల వారితో కలిసి కుటుంబసభ్యులు ఆ యువకుడిని వెతికి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ మొగులయ్య, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. 

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు కృషి
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్పీ సాయంతో జిల్లా జడ్జితో మాట్లాడించి ఫాస్ట్రుటాక్‌ కోర్టు ఏర్పాటుచేసి త్వరితగతిన శిక్షపడేలా చేస్తామని పరిగి సీఐ మొగులయ్య తెలిపారు. 

బాలికను దత్తత తీసుకుంటా: ఎమ్మెల్యే
ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన ఇలాంటి ఘటనలు జరగడ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికను దత్తత తీసుకుని పెద్దయ్యే వరకు ఆమెను చదివిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వికారాబాద్‌లోని సఖి కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బాలికను పరామర్శించారు. అయితే ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరా తీశారు.

మరిన్ని వార్తలు