పసిపిల్లలపై పైశాచికం

23 Apr, 2018 10:57 IST|Sakshi
ఆసిఫాపై అఘాయిత్యానికి నిరసనగా గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు(ఫైల్‌)

చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడు ఇప్పటికే 39 ఘటనలు

ఆందోళన కలిగిస్తున్న కామాంధుల అకృత్యాలు

ముక్తకంఠంతో ఖండిస్తున్న ప్రజలు

సంగారెడ్డి క్రైం: కళ్లాకపటం ఎరుగని పసిపిల్లలపై కొంతమంది మనుషుల రూపంలో ఉన్న మృగాలు దాడికి పాల్పడుతున్నాయి. అభంశుభం ఎరుగని అమాయకులైన పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడుతూ సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు కొందరు కామాంధులు. ఇటీవల పసిపిల్లలపై అఘాయిత్యాలపై దేశంలో తీవ్ర అలజడి, ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోనూ చిన్నారులపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు ఉన్నాయి.

బడుల్లో కొందరు రాబందులు..
కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి పవిత్రమైన వారి వృత్తికే మచ్చతెస్తున్న ఘటనలు అనేకం. పిల్లలను సొంత బిడ్డలుగా చూడాల్సిన టీచర్లు వారిపై పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల విద్యార్థినులపై జరిగిన ఆకృత్యాలు ఆందోళనకు గురి చేశాయి.

దురా‘గతా’లివీ..
పుల్‌కల్‌ మండలం కోర్పోల్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిలపై వేధింపులకు పాల్పడడంతో విషయం తెలసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్‌ చేశారు. జిన్నారం మండలంలోని బొల్లారం ఉన్నత పాఠశాలలో ఇదే ఆరోపణలతో ఇద్దరు ఉపాధ్యాయులను, శివనగర్‌ పాఠశాలలో ఒక ఉపాధ్యాడు సస్పెండ్‌ చేశారు.
తూప్రాన్‌ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ కామాంధుడు ఆరు సంవత్సరాలు ఉన్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి మధ్యాహ్నం బయటకు తీసుకెళ్లాడు. రోడ్డుకు వేసే రింగు పైపుల్లో ఆ పాపను ఆత్యచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటనలో జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతి కొద్ది వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనలో నిందుతుడు జైలు పాలయ్యాడు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు.

ఆత్మరక్షణ కోసం ....
అమ్మాయిలు వ్యక్తిగత రక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో కనీస పరిజ్ఞానం, పరిసరాలపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను ఎదుర్కొవడమే కాకుండా తప్పించుకోవచ్చని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పక్కదారి పట్టిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు..
యువతను ఆండ్రాయిడ్‌ ఫోన్లు పక్కదారి పట్టిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతు న్న వారిలో ఫోన్‌లలో అశ్లీల దృశ్యాలను చూస్తు న్న వారే అధికంగా ఉంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలను స్మార్ట్‌ ఫోన్లకు దూరంగా ఉంచితే మంచిది.

షీ టీమ్‌లతో కొంత వరకు తగ్గుముఖం...
మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్‌లను ఏర్పాటు చేసింది. బస్టాండ్‌లు, రైల్వే స్టేష న్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు తదితర రద్దీ ప్రాం తా ల్లో మహిళలపై వేధింపులు షీ టీమ్స్‌ వల్ల తగా ్గయి. సివిల్‌ డ్రెస్‌లో ఉంటున్న మహిళా పోలీసు లు ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటనలు అనేకం.

కఠిన చర్యలు తీసుకుంటున్నాం
బాలికలపై అత్యచారాలు, వేధింపుల కేసులో ఫోక్స్‌ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో తల్లిదండ్రులు వెనుకంజ వేసినా సంబంధిత అధికారుల చేత ఫిర్యాదులు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫోక్స్‌ యాక్టు కింద కేసు నమోదు అయినా ప్రత్యేక అధికారిని నియమించి కేసును ఛేదించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సంగారెడ్డిని నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి.  –  సిద్దిపేట సిపి జోయెల్‌ డేవిస్‌

బాలికల భద్రతకు భరోసా సెంటర్‌ ఏర్పాటు
జిల్లాలో బాలికలపై అత్యాచారాలు, వేధింపులను నిరోధించడానికి భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టిలో మహిళా పోలీసులతో గస్తీ నిర్వహిస్తాం. మహిళలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్‌ స్టేషన్‌లకు సంబంధం లేకుండానే ఫిర్యాదు చేయడానికి వింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మైనర్‌లపై జరిగే వేధింపుల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాం. అలాంటి ఘటనలను ఛేదించడానికి ప్రత్యేక పోలీసులను సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం  – చందనాదీప్తి మెదక్‌ ఎస్పీ

మరిన్ని వార్తలు