మూడేళ్లుగా నిత్యనరకం

14 Jan, 2019 02:59 IST|Sakshi
అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డులతో ఆందోళన నిర్వహిస్తున్న బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు

బాలికపై సామూహిక లైంగిక దాడి

ఆలస్యంగా వెలుగులోకి.. 

వీడియో తీసి బెదిరింపులు..  

నిందితుడిని సాక్షిగా పేర్కొనడంపై బంధువుల ఆందోళన 

వివరాలు సేకరించిన భరోసా బృందం

హైదరాబాద్‌:  ఓ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌ కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి బంధువుల ఆందోళనతో ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... పురానాపూల్‌ మురళీనగర్‌ ప్రాంతానికి చెందిన బాలిక(16) ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. బాలిక ఇంటి సమీపంలోనే ఆమె మేనత్త కుటుంబం నివాసముంటోంది. మూడేళ్ల క్రితం మేనత్త కుమారుడు రాజేశ్‌ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి గొల్లకిడికి ప్రాంతంలో స్నేహితులతో కలసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్‌మీడియాలో పెడతామని బెదిరిస్తూ మూడేళ్లుగా వారు ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. వారి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్‌ 24న ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై తండ్రి, కూతురు కలసి కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ నిందితులు రాజేశ్, శుభం, అభిజిత్‌ కౌశిక్‌లను అరెస్ట్‌ చేసి డిసెంబర్‌ 31న రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఈ కేసులో విజయ్‌ అనే యువకుడిని సాక్షిగా పేర్కొనడమేగాక వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. విజయ్‌ కూడా తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, అతడిని కూడా అరెస్ట్‌ చేయాలని బాధితురాలు, ఆమె బంధువులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై సమాచారం అందడంతో ‘భరోసా’టీమ్‌ అక్కడికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు సేకరించింది. మొత్త 10 మంది తరచూ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు సమాచారం.   

కఠినంగా శిక్షించాలి: అనిల్‌ కుమార్‌ యాదవ్‌  
బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మద్దతు తెలిపారు.  

లోతుగా దర్యాప్తు చేపట్టాలి: ఉమామహేంద్ర 
బాలికపై లైంగికదాడి కేసులో పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నగర ఉపాధ్యక్షులు ఉమామహేంద్ర అన్నారు. ఆందోళన చేస్తున్న బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మద్దతు పలికారు. 

‘బాధితురాలికి న్యాయం చేయాలి’
బాలికను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ గత మూడేళ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతారావు డిమాండ్‌ చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్కొన్న విజయ్‌ కూడా లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతుందన్నారు.

వివరాలు సేకరిస్తున్నాం: ఇన్‌స్పెక్టర్‌ 
బాలికపై లైంగికదాడి జరిగినట్లు గత డిసెంబర్‌ 24న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి 31న ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామాటిపురా ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ‘సాక్షి’గా ఉన్న విజయ్‌ కూడా తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, అతడిని కూడా నిందితుడిగా చేర్చాలని, మరికొందరు నిందితులు ఉన్నారని బాధితురాలు చెబుతోందన్నారు. ‘భరోసా’బృందం బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా శ్రీదేవిని నియమిస్తూ హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు