ఆడ పిల్లలకు రక్షణ ఏదీ..?

25 May, 2018 07:48 IST|Sakshi

 జిల్లాలో పెరుగుతున్న లైంగిక దాడులు

పిల్లల్ని జాగృతి చేసే ప్రభుత్వ శాఖలేవీ

వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో కలవరం

చిత్తూరు అర్బన్‌: సభ్య సమాజం ఏ మాత్రం జీర్ణించుకోలేని ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో ఎక్కువవుతున్నాయి. అందులోనూ చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడంలేదు. చట్టాల్లో ఎన్ని మార్పులు చేస్తున్నా, శిక్షలు కఠినతరం చేస్తున్నా ప్రయోజనం లేదు. గ్రామాల్లోని ప్రజలకు వీటిపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతానికి కారణంగా తెలుస్తోంది.

తల్లిదండ్రులదే బాధ్యత
ఆడ పిల్లల్ని కంటి రెప్పలా కాపాడుకుంటున్నాం. అయినా సరే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ చాలామంది తల్లిదండ్రులు వాపోతుంటారు. వాస్తవంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే లైంగిక అఘాయిత్యాలపై కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా ఇబ్బందికి గురిచేస్తే ధైర్యంగా పెద్దలకు చెప్పాలనే ధీమా కల్పించాలి. కళాశాలల్లో చదివే యువతులకు సోషల్‌ మీడియా వల్ల కలిగే దుష్పరిణామాలు, ఇబ్బందుల్ని వివరంచాలి. అప్పుడే ఆడ పిల్లల్లో మానసిక వికాసం కలుగుతుంది. 

కౌన్సెలింగ్‌ అవసరం
చిన్నపిల్లలు, మహిళలపై లైంగిక దాడులను నివారించే బాధ్యత ఏ ఒక్కశాఖకో పరిమితమం కాదు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులు, మాతా శిశు సంరక్షణ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖలతోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థపైనే ప్రధాన బాధ్యత ఉంది. ముఖ్యంగా నిరక్షరాస్యత ఉన్న గ్రామాల్లో లైంగికదాడులపై ప్రజల్ని చైతన్యం చేయాలి. చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.

చట్టాలు కఠినం..
పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫర్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ (పోక్సో) యాక్టు –2012 కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయొచ్చు. ఇంట్లోని కుటుంబ సభ్యులు, సమాజంలోని వ్యక్తులు మైనర్‌ బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడితే ఈ యాక్టు కింద కేసు పెట్టొచ్చు. సాక్ష్యాలు నిరూపితమైతే న్యాయస్థానం నిందితులకు కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించొచ్చని చట్టం చెబుతోంది.

  • పుంగనూరులో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు రెండు నెలలుగా లైంగికదాడులు చేస్తూనే ఉన్నారు. సెల్‌ఫోన్లలో వచ్చే పోర్న్‌ (నగ్న చిత్రాలు) చూసి ఇలా చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితులు మైనర్లు కావడంతో కేసు నమోదు చేసి తిరుపతి నగరంలోని జువైనల్‌ హోమ్‌కు తరలించారు.
  • ఈ నెల 11న శ్రీకాళహస్తిలోని చెర్లోపల్లెలో సుబ్బయ్యనాయుడు అనే వ్యక్తి ఐదేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపి లైంగిక దాడి చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
  • చంద్రగిరి మండలంలో ఉమాపతి అనే వ్యక్తి మద్యం మత్తులో కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం చేసిన ఘటన మనం మనుషుల మధ్య ఉన్నామా అనే అనుమానాన్ని కలిగి స్తోంది. తాను పడుతున్న నరక యాతనను తల్లికి చెబితే.. నాన్నేగా ఊరుకో..! అంటూ ఆమె చెప్పిన సమాధానంతో సభ్య సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనలో పోలీసులు తల్లిదండ్రులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
మరిన్ని వార్తలు