మీకో ‘గిఫ్ట్‌’ వచ్చిందని..

10 Jun, 2020 04:58 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఏవీ రంగనాథ్‌

200 మంది యువతులపై లైంగిక వేధింపులు 

పోలీసుల ముందుకు 30 మంది బాధితులు

నల్లగొండ క్రైం: మీకో గిఫ్ట్‌ వచ్చిందంటూ ఫోన్‌ చేస్తాడు.. వీడియో కాల్‌ చేస్తాను ఎత్తండి అంటూ వాట్సాప్‌ వీడియో కాల్‌ చేస్తాడు. ఆ తర్వాత వీడియోలో నగ్నంగా కనిపిస్తూ వెంటనే స్క్రీన్‌షాట్‌ తీసుకుని అదే ఫొటోను వారికి వాట్సాప్‌లో పంపిస్తాడు. ఆ తర్వాత ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించి యువతుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ సైకో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 200 మంది యువతులు ఈ యువకుడి బారిన పడగా.. 30 మంది బాధితులు పోలీసుల ముందుకు వచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏవీ రంగనాథ్‌ వివరాలు వెల్లడించారు. పార్శ అఖిల్‌ అలియాస్‌ చందు సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట పరిధిలో ఒక హోమ్‌కేర్‌ సెంటర్‌లో వార్డుబాయ్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలో హోమ్‌కేర్‌లో ఉండే నర్సుల ఫోన్‌ నంబర్లు తీసుకుని వారికి తరచూ ఫోన్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ తతంగం రెండు మూడేళ్లుగా నడుస్తోంది. ముందుగా వారికి ఫోన్‌ చేసి నీకో బహుమతి వచ్చింది. వీడియో కాల్‌ ఎత్తండి అని చెప్పేవాడు. వెంటనే వారి నుంచి ఫోన్‌ రాగానే వీడియోలో నగ్నంగా కనిపిస్తూ స్క్రీన్‌షాట్‌ తీసుకొని తిరిగి వారికి వాట్సాప్‌లో పంపేవాడు. ఇలా హోమ్‌కేర్‌లో ఉండే నర్సులతో పాటు వారి స్నేహితుల నంబర్లను సేకరించి వారికి ఫోన్‌ చేసి లైంగికంగా వేధించేవాడు. ఇలా దాదాపు 200 మందికి పైగా యువతులు ఆ సైకో బారిన పడ్డారు.

ఇటీవల నల్లగొండ పట్టణంలోని ఓ వ్యక్తికి వైద్యం అందించేందుకు వచ్చిన నర్సుకు అఖిల్‌ తరచూ ఫోన్‌ చేసి లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ యువతి చివరికి విరమించుకుని షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి కోసం అఖిల్‌ నల్లగొండకు వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇతనిపై గతంలో పలు అత్యాచారం, దొంగతనం కేసులతోపాటు వేధింపుల కేసులు హైదరాబాద్‌ జంట నగరాల్లో పలు పోలీస్‌ స్టేషన్లలో నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు