పసిమొగ్గలపై మృగాళ్ల పంజా

14 May, 2018 09:16 IST|Sakshi
బాధితులను పరామర్శించి వస్తున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న, జేసీ గిరీషా

శ్రీకాళహస్తిలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపులు

కల్లూరులో 13 ఏళ్ల బాలికపై  అత్యాచార యత్నం

గతంలోనూ జిల్లాలో పలుచోట్ల చిన్నారులపై అఘాయిత్యాలు

మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్‌

సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి రూరల్‌ : దాచేపల్లి మృగాళ్లు... జిల్లాలోనూ ఉన్నారు. అభం శుభం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన... కల్లూరులో శనివారం రాత్రి జరిగిన అత్యాచార యత్నాలే ఇందుకు నిదర్శనం. గతంలోనూ జిల్లాలో పలుచోట్ల చోటు చేసుకున్న ఘటనలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారి ని కఠినంగా శిక్షించటంతో పాటు... భవిష్యత్‌లో దాచేపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుం డా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

శ్రీకాళహస్తిపరిధిలోని చెర్లోపల్లెకు చెందిన సుబ్బయ్యనాయుడు (58) అదే గ్రామానికి చెందిన ఐదు, ఏడేళ్ల బాలికలను కొంత కాలంగా వికృత చేష్టలతో వేధిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్లి వస్తున్న చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి పిలిచి వికృత చేష్టలు చేయబోయాడు. భయపడిన చిన్నారులు అక్కడి నుంచి పారిపోయి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. కూలి పనుల నిమిత్తం నెల్లూరుకు వెళ్లి ఉన్న ఆమె భర్త ఆదివారం రావడంతో విషయం చెప్పారు.

పిల్లలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఇది తెలుసుకున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న చెర్లోపల్లెకు వెళ్లారు. బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. కల్లూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అల్తాఫ్‌ (24) అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలిక బంధువు నివాసంలోని మేడపై నిద్రిస్తుండగా  బాలిక నోట్లో గుడ్డకుక్కి ఎత్తుకెళ్లాడు. బాలికను బెదిరిస్తుండగా బంధువులు నిద్రలేవడంతో అతను పారిపోయాడు. ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్తాఫ్‌ను అరెస్టు చేశారు.

ఎందరో మృగాళ్లు..
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిన్నారులపై కొందరు మృగాళ్లు అత్యాచారయత్నానికి పాల్పడగా మరికొందరిని లైంగికంగా వేధించిన సంఘటనలు ఉన్నాయి. సోమలలో రామచంద్ర య్య (60) అనే వ్యక్తి తన ఇంటిపక్కనున్న మూడేళ్ల పాపపై అత్యాచారం చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చి చిన్నారిని బలాత్కారం చేశాడు. 2016లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అలాగే మదనపల్లెలో శివయ్య(58) అనే వ్యక్తి  మాయమాటలు చెప్పి 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో గత ఏడాది నాలుగేళ్ల చిన్నారిపై మరో బాలుడు అఘాయత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు మైనర్‌ కావడంతో చితకబాది కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపినట్లు తెలిసింది.

వెలుగు చూసినవి కొన్నే అయితే... వెలుగుచూడనివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు చెబితే పరువు పోతుందని పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇలాంటి సంఘటనలు  తలెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులపై ఇంటిపక్కనున్నవారు, బంధువులు, పాఠశాల టీచర్ల నడవడికపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు