పోలీసులమంటూ అత్యాచారం

12 Feb, 2020 04:38 IST|Sakshi
వ్యక్తితో వెళ్తున్న మహిళ

బస్సు దింపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు

జహీరాబాద్‌: మహిళతో పరిచయం పెంచుకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసునని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని పస్తాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్‌ కథనం ప్రకారం.. కోదాడ నియోజకవర్గంలోని లక్ష్మీపురానికి చెందిన మహిళ(35) భర్త మరణించడంతో కిరాణం కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. తన కొడుకుతో కలిసి వ్యాపారం నిమిత్తం నిషేధిత గుట్కాలు కొనేందుకు సోమవారం కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లింది. మంగళవారం ఉదయం వాటిని కొనుగోలు చేసి కోదాడకు బయలుదేరింది. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తితో కలిసి ఆమె బస్సు దిగింది. అతనితోపాటు అతని స్నేహితుడు సైతం బస్సు దిగాడు.

అయితే మొదటి వ్యక్తి తాము పోలీసులమని, బ్యాగ్‌ను తనిఖీ చేయాలని చెప్పడంతో ఆమె భయపడింది. తాము చెప్పినట్లు వినాలని, లేదంటే కేసు పెడతామని హెచ్చరించడంతో నిందితుడు చెప్పినట్లు చేస్తానని ఒప్పుకుంది. దీంతో బాధితురాలిని పస్తాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద గల దుకాణాల సముదాయం వెనుకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో వచ్చిన మరో వ్యక్తిని, ఆమె కుమారుడిని పస్తాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద గుట్కాకు కాపలా ఉంచాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం మహిళను అక్కడే వదిలిపెట్టి ఆమె తీసుకువచ్చిన గుట్కాతో వారు పరారయ్యారు. బాధితురాలు జహీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు