యాచకురాలిపై లైంగికదాడి..

14 Sep, 2019 12:59 IST|Sakshi

మద్యం మత్తులో ఇద్దరి అరాచకం

చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

రిమ్స్‌ నుంచి పరారైన బాధితురాలు

ప్రకాశం, జరుగుమల్లి (సింగరాయకొండ): మానసిక దివ్యాంగురాలైన యాచకురాలిపై మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి విఫలయత్నం చేశారు. బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం చింతలపాలెం ఎస్సీ కాలనీ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. అందిన వివరాల ప్రకారం కొద్ది రోజులుగా సుమారు 35 ఏళ్ల మహిళ చింతలపాలెంలో యాచక వృత్తి చేసుకుంటూ జీవిస్తోంది. ఈమె మానసిక దివ్యాంగురాలు. వేకువ జామున సుమారు ఒంటిగంట సమయంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నలమల మాల్యాద్రి (50), మెండా సుబ్బారావు(27)లు మద్యం మత్తులో ఆమెపై లైంగిక దాడికి విఫలయత్నం చేశారు.

బాధితురాలు వారి నుంచి తప్పించుకునేందుకు బిగ్గరగా కేకలు వేసింది. యాచకురాలి కేకలు విని ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన కాలనీ వాసులు వీరిద్దరినీ గమనించి పట్టుకుని తప్పించుకుని వెళ్లకుండా చెట్టుకు కట్టేశారు. యాచకురాలు నిందితుల నుంచి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె గొంతుపై గాయమైంది. స్థానికులు సుమారు 4.30 గంటల సమయంలో 108 సిబ్బందికి సమాచారం అందించి ఆమెను రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరిన యాచకురాలు ఆస్పత్రి నుంచి పరారైంది. పోలీసులు యాచకురాలిని వెతికే ప్రయత్నం చేసినా ఆమె దొరకలేదు. ఈలోగా గ్రామస్తులు నిందితులను తీవ్రంగా దూషించారు. తెల్లారిన తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. వీరిద్దరిలో మాల్యాద్రికి గతంలో మోటారు సైకిల్‌ దొంగగా పోలీసులకు సుపరిచితుడు. సుబ్బారావు ఓ సీఫుడ్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కమలాకర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు