పోలీసునని బెదిరించి..

6 Aug, 2019 11:17 IST|Sakshi
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిందితుడు శంకరయ్య నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనం

యువతిపై అత్యాచారం

కేసును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ  

సంగారెడ్డి రూరల్‌ :  పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం చేసిన నిందితున్ని అరెస్టు చేసి వివరాలను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి  సోమవారం మీడియాకు వివరించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జిల్లాకు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి ఓడీఎఫ్‌ ఎస్టేట్‌కు వెళ్లే కంది గేటు వద్ద ఉండగా కంది మండలం కలివేములకు చెందిన గొల్లశంకరయ్య వారి వద్దకు వెళ్లాడు.  తాను పోలీసునంటూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని బెదిరిస్తూ ఆ యువతి స్నేహితుడిపై దాడి చేసి  పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తానని చెప్పి యువతిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. మధ్యాహ్నం నుంచి  రాత్రి వరకు రుద్రారం, గణేష్‌గడ్డ, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, హత్నూర, వట్‌పల్లి మీదుగా తీసుకెళ్లి సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌ శివారులో అత్యాచారం చేశాడు.

రాత్రి 9 గంటలకు సదాశివపేటలో వదిలిపెట్టి అప్పటి వరకు తన వద్ద ఉంచుకున్న యువతిని, ఆమె స్నేహితుడి సెల్‌ఫోన్‌లను ఆమెకు ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ నెల 28న ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంద్రకరణ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు డీఎస్పీ  శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను ఉపయోగించుకొని యువతిపై అత్యాచారానికి పాల్పడిన  నేరస్తుడు గొల్ల శంకరయ్యగా గుర్తించారు. ఇతను కలివేములలో ఆర్‌ఎంపీ వైద్యునిగా  పని చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు. నిందితుడు శంకరయ్య ఒంటరిగా, జంటగా కనిపించిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని పోలీసునని బెదిరించి జన సంచారం లేని ప్రదేశాలకు తీసుకెళ్లి వారి ఫొటోలు, వీడియోలు తీసి మీడియా, నెట్‌లో పెడతానని చెప్పి అత్యాచారం జరిపేవాడని పేర్కొన్నారు. ఈ మేరకు నిందితున్ని అరెస్టు చేసి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా