అత్యాచారం.. ఆపై అశ్లీల వీడియోలు తీయాలని..

13 Jul, 2020 07:14 IST|Sakshi

నీచఘటనకు తల్లి సహకారం 

మోడలింగ్, అశ్లీల వీడియోలు తీయాలని ఒత్తిడి 

సాక్షి, బెంగళూరు : కామంతో కళ్లు మూసుకుపోయి వరుసకు పినతండ్రి అయిన ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నీచఘటన ఉద్యాన నగరిలో ఆదివారం వెలుగుచూసింది. ఈ దారుణానికి తన తల్లి కూడా సహకరించిందని బాధితురాలు (20) హుళిమావు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారం, బెదిరింపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అరికెరె సామ్రాట్‌ లేఔట్‌ నివాసి అలెగ్జాండర్‌ దాస్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. 
బాధితురాలి తల్లి రీమా కొద్ది సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న అనంతరం అలెగ్జాండర్‌ దాస్‌ను వివాహం చేసుకుంది. అలెగ్జాండర్‌ నిర్మాణ కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత యువతి నగరంలోని పేరుపొందిన కాలేజీలో చదువుతోంది. తల్లి, పినతండ్రితో కలిసి అరెకెరెలో అద్దె ఇంటిలో ఉంటోంది.   

ఆహార పదార్ధాల్లో నిద్రమాత్రలు: తల్లి టీ, ఇతర ఆహార పదార్థాల్లో నిద్రమాత్రలు వేసి కుమార్తెకు ఇచ్చేది. మత్తులో జారుకున్న అనంతరం పినతండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిన్నర క్రితం ఓ కార్యనిమిత్తం  హైదరాబాద్‌కు తీసుకెళ్లి హోటల్‌ రూమ్‌లో  బలవంతంగా మద్యం తాపించి స్పృహకోల్పోయిన అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఉదయం స్పృహలోకి రావడంతో తన శరీరంపై దుస్తులు లేవు.

మొదటిసారి తనకు కడుపునొప్పి లక్షణాలు కనబడ్డాయని తెలిపింది. ఇలా తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడని, దీనిపై ప్రశ్నిస్తే మొబైల్‌ లాక్కుని కాలేజీకి వెళ్లద్దు అంటూ బయట ఈ విషయం తెలిస్తే ఊరుకునేది లేదని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురై ఇళ్లు వదిలిపెట్టి వెళ్లానని, తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలన్నారు. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు వివరించారు. 

మోడలింగ్, నగ్నవీడియోలు తీయాలని ఒత్తిడి 
కాలేజీకి వెళ్లడాన్ని నిలిపివేసి మోడలింగ్‌ చేయాలని, అశ్లీల వీడియోలు తీయాలని, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని పీడించేవాడు.  నిత్యం డ్రగ్స్, మద్యం తాగాలని యువతిపై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. పలుమార్లు తనకు తెలియకుండా మద్యం, డ్రగ్స్‌ ఇచ్చి మత్తులోకి జారుకునేలా చేసేవాడని దీనికి తన తల్లి కూడా సహకారం ఉందని బాధితురాలు పోలీసులతో పేర్కొంది. పరారీలో ఉన్న నీచుడికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు