ప్రేమజంటలపై పైశాచికం.. సెల్‌ఫోన్లలో చిత్రీకరణ

22 Jun, 2019 07:43 IST|Sakshi

ప్రేమజంటలపై పైశాచికం

యువతులపై సామూహిక అత్యాచారాలు ఆపై సెల్‌ఫోన్లలో చిత్రీకరణ

పోలీసుల ముసుగులో ఐదుగురు పోకిరీల చేష్టలు

ఇద్దరు యువకులు అరెస్ట్‌

సేలం, పుదుచ్చేరిలో మరో ఇద్దరు యువతులపై ఆఘాయిత్యం

సాక్షి ప్రతినిధి, చెన్నై: కామంతో కన్నూమిన్నూ కానరాని మదం పట్టిన ఐదుగురు యువకులకు కన్నెపిల్లలే లక్ష్యం. బెదిరించడం, చెరపట్టడం, ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి సామూహిక అత్యాచారాలకు పాల్పడటమే వారి నిత్యకృత్యం. సుమారు వందమందికి పైగా యువతులు, కాలేజీ విద్యార్థినులు వారి కామప్రకోపానికి గురయ్యారు. ఓ బాధిత యువతి ఫిర్యాదుతో ఆ కాముకుల బండారం బయటపడింది.

వివరాలు..
కల్లకురిచ్చి జిల్లాకు చెందిన రాజా (45) ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. ధనికుడు కావడంతో జులాయిగా మారి జల్సా జీవితానికి అలవాటుపడ్డాడు. తన దుర్మార్గ చేష్టలకు మరో నలుగురిని కూడగట్టాడు. తన సొంతకారుపై పోలీస్‌ అనే అక్షరాలతో కూడిన స్టికర్‌ను అతికించాడు. రాజా సహా ఐదు మంది కలిసి నకిలీ పోలీసుల్లాగా మారి తెంపరితనానికి తెగించారు. పోలీసులు, బాధిత యువతుల కథనం ప్రకారం.. కల్లకురిచ్చి కుల్లకరుప్పన్‌ ఆలయం వెనుక వైపు చెరుకుతోట, దాని వెనుక మరుగైన ప్రాంతంలో చెరువు ఉంది. అనేక ప్రేమజంటలు అక్కడికి వెళ్లి ముచ్చట్లాడుకోవడం, సన్నిహితంగా మెలగడం పరి పాటి. ఈ యువకుల ముఠా అక్కడి చెట్ల పొదల్లో దాక్కుని ప్రేమజంటల కార్యకలాపాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తారు. ఆ తరువాత వారి పై దాడిచేసి వెళ్లగొడతారు. ప్రియుడు పారిపోగా ఒంటరిగా దొరికిన కాలేజీ విద్యార్థినులు, యువతులకు తాము పోలీసులమని పరిచ యం చేసుకుని ఇన్‌స్పెక్టర్‌ను పిలిపిస్తున్నామనిచెప్పి రాజాను రప్పిస్తారు.

రాజా వచ్చీరాగానే తీవ్రంగా దుర్భాషలాడి యువతుల పేరు, చిరునామా తదితర వివరాలను సేకరిస్తాడు. తల్లిదండ్రులకు చెప్పేనా లేక వ్యభిచారం కేసులో అరెస్ట్‌ చేసి జైల్లోకి నెట్టేనా అని బెదిరిస్తాడు. ఈ మాటలకు భయపడిపోయిన యువతులను 4 ఎకరాల విస్తీర్ణంలోని తన చెరుకుతోట పంపుసెట్టు గదికి తీసుకెళ్లి తన కోర్కెను తీర్చాలని కోరుతాడు. ఈ సమయంలో యువతులు దుస్తులు విప్పడాన్ని సెల్‌ఫోన్‌ చిత్రీకరిస్తూ లైంగికదాడికి పాల్పడుతాడు. ఆ తరువాత తన స్నేహితులను సైతం అక్కడికి రప్పించి యువతులను అప్పగిస్తాడు. గత ఆరునెలల కాలంగా ఈ అరాచక ముఠా చేతిలో ఎందరో యువతుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇదే కోవలో కల్లకురిచ్చిలోని ఓ ప్రభుత్వ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై రాజా (45) అతని స్నేహితుడు వేలుమణి (24) కన్నేశారు. ప్రతిరోజూ వెంటబడుతూ అసభ్య మాటలతో ఆమెను వేధించేవారు. దీంతో ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులతో చెప్పుకుని భోరున విలపించింది. బాధిత విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కల్లకురిచ్చి పోలీసులు రాజా, వేలుమణిని గురువారం అరెస్ట్‌ చేయడంతో వారి దారుణాలు వెలుగుచూశాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో సుమారు వంద మంది యువతుల అశ్లీల వీడియోలను చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. పోలీస్‌ అని స్టిక్కర్‌ అంటించి ఉన్న ఫైనాన్షియర్‌ రాజా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో ఇద్దరు యువతులపై ఘాతుకాలు: ఇదిలాఉండగా కల్లకురిచ్చిని పోలిన సంఘటనలే సేలం, పుదుచ్చేరిలో చోటుచేసుకున్నాయి. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన కాలేజీ విద్యార్థిని (22) పాఠ్యపుస్తకం కొనేందుకు ఈనెల 18వ తేదీన తన అక్క భర్తతో మోటార్‌బైక్‌పై బయలుదేరింది. అదే రోజు రాత్రి తిరుగుప్రయాణంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మోటార్‌బైక్‌ను నిలపమని కోరి మారుమూల పొదల్లోకి వెళ్లింది. పూటుగా మద్యం సేవించిన ఐదుగురు యువకులు రెండు బైక్‌లలో అక్కడికి చేరుకుని యువతి బావను చితకబాదారు. ఆ తరువాత పొదల్లోకి వెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి పారిపోయారు. వారి బెదిరింపులకు భయపడి ఆరోజు మిన్నకుండిపోయారు. అయితే గురువారం ధైర్యం తెచ్చుకుని సేలం పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఐదు మందితో కూడిన రౌడీ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె బావ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రియుడి కళ్లెదుటే లైంగికదాడి: పుదుచ్చేరిలోని ఒక గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. సూరమంగళం ప్రాంతానికి చెందిన యువకుడు (21)ని ప్రేమిస్తోంది. వినాయకపురం రైల్వేగేటు సమీపంలోని ఒక పొలం గట్టుపై గురువారం రాత్రి తన ప్రియుడితో ఆమె ముచ్చట్లాడుతుండగా అక్కడికి సమీపంలో నలుగురు యువకులు మద్యం సేవిస్తున్నారు. వారంతా ప్రేమజంట వద్దకు వచ్చి ప్రేమికుడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రక్తగాయాలతో ప్రియుడు కొట్టుమిట్టాడుతుండగా అతని ఎదుటే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడు వారి నుంచి తప్పించుకుని స్నేహితుడిని వెంటపెట్టుకుని రాగా అతడిపై కూడా దాడిచేశారు. దీంతో వారు ఊరిలోకి వెళ్లి జనాన్ని కూడగట్టుకుని వచ్చేసరికి దుండగులు పారిపోయారు. కాముకుల దాష్టీకంలో తీవ్రగాయాలకు గురై నేలపడి పడి ఉన్న యువతిని ఆస్పత్రిలో చేర్పించగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలే కారణం– న్యాయమూర్తులు
యువత సెల్‌ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన అశ్లీలవీడియో దృశ్యాలే ఇలాంటి విపరీత చేష్టలకు ప్రధాన కారణమని శుక్రవారం ఒక కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా