డ్రగ్స్‌కు బానిసైన కుమార్తెను..

28 Aug, 2019 12:47 IST|Sakshi

చండీగఢ్‌ : పంజాబ్‌లో యువత డ్రగ్స్‌తో ఎలా చిత్తవుతున్నదో తెలిపే మరో దారుణ ఘటన వెలుగుచూసింది. డ్రగ్‌కు బానిసైన 24 సంవత్సరాల ఓ యువతిని వారం రోజులుగా ఆమె తల్లి మంచానికి కట్టిపడేసిన ఘటన సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. అమృత్‌సర్‌లోని రంజిత్‌ అవెన్యూలో కుటుంబ సభ్యులతో కలిసి నివసించే యువతి డ్రగ్స్‌కు బానిసై వాటి కోసం రోజుకు రూ 500 నుంచి రూ 1000 వెచ్చిస్తోంది. గతంలో బ్యూటీ టెక్నీషియన్‌గా పనిచేసిన యువతి చివరికి మాదకద్రవ్యాలను తీసుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరింకపోవడంతో ఇంట్లోని వస్తువులను విక్రయించి రోజుల తరబడి ఇంటికి రాకుండా డ్రగ్స్‌ సేవించే పరిస్థితికి చేరింది. దిక్కుతోచని స్థితిలో యువతి తల్లి ఆమెను మంచానికి చైన్‌లతో కట్టిపడేసి ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చండీగఢ్‌లోని బ్యూటీపార్లర్‌లో తమ కుమార్తెకు డ్రగ్స్‌ అలవాటు అయ్యాయని, డ్రగ్స్‌కు బానిసైన తమ కుమార్తెను ఆ అలవాటు మాన్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని బాధితురాలి తల్లి వాపోయారు. తమ కుమార్తెను డ్రగ్‌ డీఎడిక్షన్‌ సెంటర్‌కు పలుమార్లు పంపినా ఎలాంటి ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యువతిని నిర్బంధించడం సరికాదని సమస్య ఉంటే రీహబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని అదనపు డీసీపీ హిమాన్షు అగర్వాల్‌ చెప్పారు. పంజాబ్‌లో డ్రగ్స్‌ సమస్య పరిష్కారం కోసం త్వరలో తాము ముఖ్యమంత్రితో భేటీ అవుతామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు