డబ్బులు డబుల్‌ చేస్తామని..

3 Oct, 2019 11:33 IST|Sakshi

కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి టోకరా

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

మల్లాపూర్‌: కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి వాటిని రెట్టింపు చేస్తామని దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను బుధవారం మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్‌ మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ లింగయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నం జిల్లాకు చెందిన బొక్క భరత్‌కుమార్‌ అలియాస్‌ మణి  సరూర్‌నగర్‌ మీర్‌పేట్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన స్క్రాప్‌ వ్యాపారి  షేక్‌ ఖాజా వలి హుస్సేన్, ఆదినారాయణతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మల్కాజిగిరికి చెందిన కంప్యూటర్ల వ్యాపారి వెంకటేశ్‌యాదవ్‌తో    భరత్‌కుమార్‌కు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో అతడిని మోసం చేయాలని పథకం పన్నిన వీరు కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి రెట్టింపు చేస్తామని వెంకటేశ్‌యాదవ్‌ను నమ్మించారు. గత ఆగస్టు  3న వెంకటేశ్‌ యాదవ్‌ మూడు రూ. 500 వందల నోట్లను తీసుకురాగా నిందితులు వాటికి రసాయనాలు పూసి  ఆరు నోట్లుగా చేశారు. 

దీంతో వారి మాటలు నమ్మిన వెంకటేశ్‌యాదవ్‌  రూ 8.16 లక్షలు తీసుకొచ్చాడు.  ఇందులో రూ 50వేలు  కమీషన్‌గా  తీసుకున్న వీరు మిగతా రూ 7.66 లక్షలను ఒక గుడ్డలో చుట్టి వెంకటేశ్‌యాదవ్‌ ఇంట్లో ఒక ప్రదేశంలో ఉంచారు. మూడు రోజుల తర్వాత వాటిని తీస్తే రెట్టింపు అవుతాయని చెప్పి వెళ్లారు. మూడు రోజుల అనంతరం అతడి ఇంటికి వచ్చిన ముగ్గురు నోట్ల మూటను వేడి చేయాలని చెబుతూ వెంకటేశ్‌యాదవ్‌ దృష్టి మరల్చి వంట గదిలోకి వెళ్లారు. పాత చెత్త పేపర్ల మూటను అతడికి ఇచ్చి రూ 7.66 లక్షలతో అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గుర్తించిన వెంకటేశ్‌యాదవ్‌ నేరేడ్‌మెట్‌ పోలీసులను ఆశ్రయించారు. బుధవారం నేరేడ్‌మెట్‌ చౌరస్తాలో సీసీఎస్‌ పోలీసులు భరత్‌కుమార్, ఖాజావలి హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి రూ1.20లక్షను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆదినారాయణను వారం రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు