మైనర్‌ డ్రైవింగ్‌... మేజర్‌ స్నాచింగ్‌!

14 Mar, 2020 09:09 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మైనర్‌తో కలిసి ముఠా కట్టిన ఓ పాత నేరగాడు సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు.  బాలుడు వాహనాన్ని నడుపుతుండగా... మేజర్‌ ఈ నేరం చేశాడు. వీరిద్దరినీ శుక్రవారం పట్టుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనం, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారని డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బాలాజీనగర్‌కు చెందిన వేముల బాలరాజ్‌ తొమ్మిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి లేథ్‌ మిషన్‌ వర్కర్‌గా మారాడు.  వ్యవసనాలకు బానిసకావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. గత ఏడాది తన స్నేహితుడితో కలిసి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. కుషాయిగూడ పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు.

జైలు నుంచి విడుదలైన బాలరాజ్‌ తన ప్రాంతానికే చెందిన ఓ మైనర్‌తో కలిసి రంగంలోకి దిగాడు. సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ చేయాలని నిర్ణయించుకున్న ఇద్దరూ నాంపల్లి పరిధిలో ఓ నేరం చేశారు. మైనర్‌ వాహనం నడుపుతుండగా వెనుక కూర్చున్న బాలరాజ్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నుంచి సెల్‌ఫోన్‌ లాక్కుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరి కదలికలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ నేతృత్వంలో ఎస్‌ఐలు మహ్మద్‌ షానవాజ్‌ షఫీ, కె.శ్రీనివాసులు వలపన్ని శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరినీ నాంపల్లి పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు