రుణాలిప్పిస్తామంటూ బురిడీ

16 Oct, 2019 11:00 IST|Sakshi

ఆశావహులకు రూ.2 కోట్ల మేర టోపీ

బ్యాంకు అధికారితో కలిసి ఇద్దరు మెప్మా ఉద్యోగుల మోసం

చెక్కులు ఇచ్చి నమ్మించిన మాయ లేడీలు

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు 

సాక్షి, గిద్దలూరు(ప్రకాశం/కడప) : దురాశపరులకు గాలమేసి, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చూసే కేటుగాళ్లు, మాయ లేడీలకు నేటి సమాజంలో కొదువలేదు. గిద్దలూరులోని మెప్మా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కూడా ఇదే బాటలో నడిచి ఎలాగైనా పెద్ద మొత్తంలో నగదు సంపాదించాలని భావించారు. సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని, ఇంటి రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి కొందరి నుంచి లక్షల్లో నగదు వసూలు చేశారు. వీరిరువురు గత ఏడాదిన్నర కాలంలో రూ.రెండు కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.

బురిడీ కొట్టించేదిలా..
స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. ఒక్కో లోనుకు ముందుగా రూ.50 వేలు చెల్లిస్తే మీ బ్యాంకు ఖాతాలో రూ.5.50 లక్షలు వస్తాయని, ఇందులో రూ.3 లక్షలు బ్యాంకు లోను, మరో రూ.2.50 లక్షలు ప్రభుత్వ రాయితీ ఉంటుందని ఆశకల్పించారు. దీంతో ఆశావహులు నాకు ఒకటి కాదు.. వేరేవాళ్ల పేరుతో మరో రెండు లోన్లకు డబ్బులు చెల్లిస్తామని ఆశపడ్డారు. ఇలా కొందరు 10 వరకు రుణాలు కావాలంటూ రూ.50 వేల చొప్పున వీరికి చెల్లించారు. ఇలా దాదాపు 300కు పైగా యూనిట్లకు రూ.50వేల చొప్పున రూ.కోటిన్నర వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అనుమానం వచ్చిన వారికి స్వచ్ఛాంధ్ర మహిళా సంఘం పేరుతో ఉన్న బ్యాంకు చెక్కుల్లో రూ.5.50 లక్షలు రాసి ఇస్తారు. ఈ చెక్కులు ఎక్కువ రోజులు చెల్లవని తిరిగి కొత్త చెక్కులు ఇస్తామని చెప్పి చెక్కులు ఇవ్వకుండా తిప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. 

గృహాలకు లోన్లు మంజూరు చేస్తామని...
పక్కా గృహాలకు రుణాలు మంజూరు చేయిస్తామని ఒక్కో ఇంటికి రూ.3.50 లక్షలు వస్తుందని, ఇందులో రూ.1.50 లక్షలు సబ్సిడీ, రూ.2 లక్షలు బ్యాంకు లోనుగా చెప్పారు. ఇందుకు తమకు రూ.50 వేలు ఇవ్వాలని, ముందుగా రూ.13 వేల చొప్పున వసూలు చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే పూరి గుడిసెలు ఉన్న ప్రాంతంలో ఫొటోలు తీయించుకోవాలని చెప్పడంతో ఏడాది క్రితం 50 మంది వరకు ఆటోల్లో దిగువమెట్టకు వెళ్లి అక్కడ పూరి గుడిశెల వద్ద ఫొటోలు తీయించుకున్నారు. ఇలా దళితులు తమ ఆర్థిక స్థోమతను బట్టి ఒక్కొక్కరు రెండు, మూడు గృహాలకు నగదు చెల్లించారు. ఇలా రూ.50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. 

కడప, కర్నూలు జిల్లాల్లోనూ బాధితులు..
బాధితుల్లో ఎక్కువగా గిద్దలూరు పట్టణంతో పాటు, మండలంలోని గ్రామాలు, రాచర్ల, కొమరోలు మండలాల్లోనూ, వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు, పోరుమామిళ్ల, కర్నూలు జిల్లాలోని మహానంది, నంద్యాల ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం గౌతవరం గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ మధ్యవర్తిగా ఉంటూ 15 మందితో నగదు కట్టించినట్లు సమాచారం. ఇతని ద్వారా నాలుగు రుణాలకు నగదు చెల్లించేందుకు ముందుకొచ్చిన ఓ యువకుడు రూ.1.,90 లక్షలు చెల్లించి మిగిలిన రూ.10వేలు ఇచ్చేందుకు గిద్దలూరు రాగా తాను మోసపోయానని గ్రహించి వాపోయాడు. యడవల్లికి చెందిన ఓ తలారి రూ.లక్ష, రంగారెడ్డిపల్లెకు చెందిన ఓ యువకుడు రూ.2లక్షలు, కర్నూలు జిల్లా అల్లీనగరంకు చెందిన ఓ మహిళ రూ.3.50 లక్షలు, సత్యవోలుకు చెంది ఓ చిరుద్యోగి రూ.60 వేలు, అదే గ్రామానికి చెందిన మరికొందరు రూ.4 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం పోరుమామిళ్లలో రూ.6 లక్షలు చెల్లించినట్లు సమాచారం. సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు ఓ బ్యాంకు మేనేజరు (ప్రస్తుతం బదిలీపై వెళ్లిన)తోనూ చెప్పించారని, ఆ నమ్మకంతోనే తాను అప్పు తెచ్చి రూ.3.50 లక్షలు చెల్లించినట్లు ఓ బాధితురాలు వాపోయింది. వీరి మోసాలకు ఓ బ్యాంకు మేనేజరు, వెలుగు ఏపీఎం, ఉయ్యాలవాడకు చెందిన రంగయ్య, స్పందన ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసిన బసవయ్య, నంద్యాలకు చెందిన ఓ యువకుడితో పాటు, గిద్దలూరుకు చెందిన ఓ అంగన్‌వాడీ టీచర్, గౌతవరంకు చెందిన ఆటో డ్రైవర్‌ సహకరించారని, వారికి పరిచయం ఉన్నవారితోనూ నగదు కట్టించినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నింధితులపై చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. 

స్పందనలో ఫిర్యాదు..
దీనిపై సీఐ సుధాకర్‌రావును వివరణ కోరగా ముగ్గురు బాధితులు స్పందనలో ఫిర్యాదు చేశారని, ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు