పెళ్లి చూపులూ ‘ఫిక్స్‌’ చేశారు..

8 Aug, 2018 07:12 IST|Sakshi

మ్యాట్రిమోనియల్‌ మోసంలో ‘మరో అడుగు’

పెళ్లికుమారుడి తండ్రితో సంప్రదింపులు

రూ.80 వేలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

కెనడాలో ఉద్యోగం పేరుతో మరో మోసం

కేసులు నమోదు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలు కావాలంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు జారీ చేయడం... ఆసక్తి చూపిన వారితో తియ్యగా మాట్లాడి పూర్తి నమ్మకం కలిగించడం... ఆపై గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ చెప్పి, పన్నుల పేరుతో దండుకోవడం... ఏళ్లుగా సాగుతున్న ఈ మ్యాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌లో పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తె మాత్రమే బాధితులుగా ఉంటారు. ఇటీవల ఈ విషయంలో సైబర్‌ నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. విదేశీ పెళ్లి కుమార్తె పేరు చెప్పి స్వదేశీ పెళ్లి కుమారుడి తండ్రి నుంచి రూ.80 వేలు కాజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్థానిక గ్యాంగ్‌ ప్రమేయాన్ని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

‘లైక్‌’ చేయడంతో షురూ.....
నగరానికి చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడి పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన తెలుగు మ్యాట్రిమోనీ.కామ్‌లోనూ రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో నిహారికారెడ్డి పేరుతో వచ్చిన ప్రకటన అతడిని ఆకర్షించింది. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బీఈ పూర్తి చేసిన నిహారిక ప్రస్తుతం అమెరికాలోని హెచ్‌పీ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్లు అందులో ఉంది. ఆమె తండ్రి నారాయణరెడ్డి బెంగళూర్‌లో రెవెన్యూ ఉద్యోగి అని, తల్లి సుశీల కేంద్రీయ విద్యాలయకు వైస్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నట్లు నేరగాళ్లు పొందుపరిచారు. వీరి స్వస్థలం నంద్యాల అని పేర్కొనడంతో ఆసక్తి చూపిన శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రొఫైల్‌ను లైక్‌ చేశారు.

నారాయణరెడ్డి పేరుతో కాల్‌ చేసి...
ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీనివాస్‌రెడ్డికి ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. తాను బెంగళూరు నుంచి నారాయణరెడ్డిని మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి తన కుమార్తె నిహారిక ఇటీవల అమెరికా నుంచి వచ్చిందని, త్వరలో తిరిగి వెళ్లిపోతుందని తెలిపాడు. ఆ లోపే మంచి సంబంధం చూసి నిశ్చితార్థం సైతం చేసేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా తన కుటుంబీకులతోనూ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంతో సంప్రదింపులు జరిపించాడు. పెళ్లి కుమారుడితోనూ పెళ్లి కుమార్తె నిహారికగా చెప్పుకుంటూ ఓ యువతి మాట్లాడింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి తాము పెళ్లి చూపుల కోసం బెంగళూరు వస్తున్నట్లు నారాయణరెడ్డితో చెప్పారు. అందుకు ఆనందంగా అంగీకరించినట్లు నారాయణరెడ్డి అనే వ్యక్తి బిల్డప్‌ ఇచ్చాడు. 

పట్టుచీర పేరుతో స్వాహా...
అప్పుడు అసలు కథ ప్రారంభించాడు. తమ ఆచారం ప్రకారం పెళ్లి చూపుల సమయంలో పెళ్లి కుమార్తె కట్టుకునే చీరను పెళ్లి కుమారుడి తరఫు వారే కొనాలని చెప్పాడు. దీనికోసమంటూ నగదు కోరడంతో శ్రీనివాస్‌రెడ్డి రెండు దఫాల్లో రూ.80 వేలు నారాయణరెడ్డిగా చెప్పుకున్న వ్యక్తికి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. పెళ్లి చూపుల కోసం గత నెల 24న రమ్మంటూ నారాయణరెడ్డి ఆహ్వానిస్తూ బెంగళూరులోని చిరునామా సైతం ఇచ్చాడు. ఆ రోజు అక్కడకు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అది బోగస్‌ చిరునామాగా గుర్తించారు. వారి తరఫు ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. తిరిగి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వీసా పేరుతో రూ.7.66 లక్షలు...
కెనడాకు వీసాతో పాటు ఉద్యోగం సైతం ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.7.66 లక్షలు కాజేశారు. భోలక్‌పూర్‌లోని కృష్ణానగర్‌కు చెందిన శ్రీకాంత్‌ నిరుద్యోగి. విదేశాల్లో సూపర్‌వైజర్‌ ఉద్యోగం కోసం ఆయన క్వికర్‌.కామ్‌లో తన బయోడేటాను అప్‌లోడ్‌ చేశారు. దీనికి స్పందనగా జేమ్స్‌ అనే వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. శ్రీకాంత్‌ను మూడు రౌండ్ల టెలిఫోన్‌ ఇంటర్వ్యూ సైతం చేశాడు. ఆపై కెనడాలో సూపర్‌వైజర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పిన జేమ్స్‌ వీసా, వర్క్‌ పర్మిట్‌ కోసం అయ్యే ఖర్చు నీవే భరించాలంటూ చెప్పడంతో శ్రీకాంత్‌ అంగీకరించాడు. దీంతో కొన్ని డాక్యుమెంట్లు సైతం పంపించిన జేమ్స్‌... విమాన టిక్కెట్లు కూడా బుక్‌  చేశానంటూ బోగస్‌వి స్కాన్‌ చేసి ఈ–మెయిల్‌ చేశాడు. ఆపై వివిధ ఫీజులు, పన్నుల పేరుతో రూ.7,66,900 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నాడు. ఆపై ఇండియన్‌ వీసా అధికారినంటూ శ్రీకాంత్‌కు కాల్‌ వచ్చింది. అతడు చండీఘడ్‌ నుంచి కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ చెప్పాడు. ఈ నెల 1న అందుకు సిద్ధమైన శ్రీకాంత్‌ కెనడా ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా వివరాలు లేకపోవడంతో. తాను మోసపోయానని తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు