పండగవేళ.. ప్రమాదం

15 Sep, 2018 07:04 IST|Sakshi
నీలాద్రిరావుపేటలో జరిగిన ప్రమాద దృశ్యం. (చిత్రంలో) మృత దేహాలు

హైవే రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, చెరువులో పడి ఒకరి మృతి

మృతుల కుటుంబాల్లో విషాదం

తూర్పుగోదావరి ,గండేపల్లి (జగ్గంపేట): సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో పండగపూట విషాదం నెలకొంది. రెప్పపాటులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.లారీ ఢీకొట్టిన  ఘటనలో తల్లీకూతురు, మరోచోట ఓ మహిళ ఇలా వేర్వేరు చోట్ల  జరిగిన సంఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం..

లారీ ఢీకొని తల్లీకూతురు..
పండగకు సరదాగా గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చిన ఆ తల్లీకూతరు దుర్మరణం చెందారు. బంధువులతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి

వెళితే..
ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన ఆచంట అప్పలరాజు అనే మహిళతో పాటు శ్రీను, శెట్టిపల్లి నాగవీరదుర్గ(దేవి)(23), అమ్ము(4)లు ఈ నలుగురు గురువారం మోటార్‌ సైకిల్‌పై మండలంలోని తాళ్లూరులో బట్టల షాపునకు వచ్చారు. తిరుగుప్రయాణంలో జెడ్‌ రాగంపేట పెట్రోల్‌ బంక్‌ వద్ద పెట్రోల్‌ పోయించుకుని సొసైటీ కార్యాలయం సమీపంలో ఉన్న డివైడర్‌ వద్ద రోడ్డు దాటారు. ముందు వెళుతున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వెనుకే వస్తున్న లారీ వీరిని ఢీకొని మోటార్‌ సైకిల్‌ను కొంతమేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో నాగ వీర దుర్గ ఎడమవైపు శరీరం నడుమ నుంచి మోకాలి వరకు నుజ్జునుజ్జయ్యి అక్కడిక్కడే మృతి చెందింది. చిన్నారి అమ్ము కూడా ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై పడిపోవడంతో శ్రీను, అప్పలరాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అప్పలరాజును జగ్గంపేట ప్రైవేట్‌ ఆస్పత్రికి, శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీవనోపాధి నిమిత్తం నాగ వీరదుర్గ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారని, ఇటీవల ఈమె పండగ నిమిత్తం లింగంపర్తి వచ్చినట్టు తెలిసింది. వీరందరూ సమీప బంధువులని చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ మద్యం సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు.

రోడ్డుపై రాస్త్రారోకో..
తమకళ్లెదుటే ప్రమాదం జరగడంతో ఆగ్రహించిన స్థానికులు, ఇతర ప్రయాణికులు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. సుమారు గంటపాటు నిర్వహించిన ఈ ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు దీరి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. డివైడర్‌ వద్ద ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

మల్లేపల్లిలో
మండలంలోని మల్లేపల్లికి చెందిన దిడ్డి సుబ్బలక్ష్మి (47) లారీ ఢీకొని మృతి చెందింది. శుక్రవారం ఉదయం గ్రామంలోని కొత్తూరు సెంటర్‌లో రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వెళుతున్న లారీ ఈమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈమె అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలిపారు.

గండేపల్లిలో..: గ్రామానికి చెందిన రాయుడు అన్నవరం (57) స్థానికంగా ఉన్న కాన్‌ చెరువులో పడి మృతిచెందాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన అన్నవరం ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు