అవును.. అతడు అనుమాన పిశాచే!

13 Dec, 2019 13:15 IST|Sakshi
కుమార్తె వైష్ణవితో శ్రీలక్ష్మి (ఫైల్‌)

అనంతరం భార్య ఉసురూ తీసిన భర్త  

అనుమానంతోనే అంతమొందించిన హంతకుడు

నిందితుడు కోటేశ్వరరావు అమ్మమ్మ ఊరు పెద్దకొత్తపల్లి

నిందితుడి గుర్తింపుతో సెల్‌ఫోన్‌ కాల్స్‌ పరిశీలిస్తున్న పోలీసులు

జంట హత్యల కేసులో నిందితులు మరికొందరు పెరిగే అవకాశం

ముగిసిన పోస్టుమార్టం.. ఒంగోలులోనే మృతదేహాల ఖననం

ఒంగోలు:అనుమానం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తల్లి ఎదుటే బిడ్డను దారుణంగా హతమార్చి అనంతరం భార్యనూ బండకేసి మోది మరీ హత్య చేసి మృతదేహాలను తగులబెట్టిన కసాయి కోటేశ్వరరావు దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కనీసం భార్య, పిల్లల ఫొటోలు సైతం దొరక్కుండా జాగ్రత్తపడ్డానని నిందితుడు భావించినా సహ కుటుంబీకులతో దిగిన ఫొటోలు మీడియా చేతికి చిక్కాయి. దీంతో ఇంతవరకు హత్యకు గురైన తల్లి శ్రీలక్ష్మి, బిడ్డ వైష్ణవిలు ఎలా ఉంటారన్న సందేహానికి తెరదించినట్లయింది.  

అనుమాన పిశాచి
ప్రేమించి.. నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించి శ్రీలక్ష్మిని పెళ్లిచేసుకున్న కోటేశ్వరరావు పెళ్లయిన కొద్ది నెలల నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మైనర్‌ అని తెలిసి కూడా ఆమెను ప్రేమ పేరుతో వంచించి చివరకు తాళికట్టి కాపురం ప్రారంభించి హింసించాడు. ఈ నేపథ్యంలోనే అతను స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తూ సమీపంలోని ముక్తినూతలపాడులో కాపురం పెట్టాడు. పొరుగింట్లో ఉండేవారు చిన్నారిని ఆడిస్తూ.. తల్లితో ఉన్న సమయంలో సరదాగా వారు తీసిన ఫొటోలే నేడు ఆధారంగా మారాయి.  ఈ నెల 2 లేదా 3వ తేదీ భార్యను కొట్టి వెళ్లిపొమ్మంటూ రూ.50లు ఇచ్చి నెల్లూరు బస్టాండ్‌లో వదిలేశాడు. ఆమె తిరిగి ఆస్పత్రికి వెళ్లింది. దంపతులతో పాటు వారి బిడ్డ తిరిగి ముక్తినూతలపాడు రాకపోవడంతో వారిద్దరు హత్యకు గురై ఉంటారన్న భావన రాలేదని,  హత్య చేసిన వ్యక్తి ఫలానా అని తెలియడంతో ఆశ్చర్యపోవడం తమ వంతైందని స్థానికులు పేర్కొంటున్నారు. కోటేశ్వరరావుకు భార్యపై అనుమానం ఏ స్థాయిలో ఉండేదంటే ఆమె జడను సైతం ఇంట్లోనే కత్తిరించి కాఠిన్యాన్ని చాటుకున్నాడు.

భార్య ఎదుటే పసిబిడ్డ హత్య
వాస్తవానికి కోటేశ్వరరావు స్వగ్రామం అద్దంకి పట్టణంలోని దామావారిపాలెం. అతను 6వ తరగతి నుంచి చదువుకుంది పేర్నమిట్ట సుబ్బయ్య స్కూల్‌. అతని అమ్మమ్మ ఊరు పెద్ద కొత్తపల్లి. హత్యాస్థలి కూడా ఈ పంచాయతీ పరిధిలోనిదే. దీంతో ఈ మార్గం అతనికి కొట్టిన పిండి. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్‌కు వచ్చిన భార్యను నమ్మకంగా బైకు ఎక్కించుకుని డొంక మార్గం నుంచి పయనమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు తొలుత భార్యను చంపి, ఆ తర్వా బిడ్డను చంపి తగులబెట్టి ఉంటాడని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందు వైష్ణవి (11 నెలలు)ను కత్తితో గొంతు కోసి చంపి ఆ తర్వాత భార్య శ్రీలక్ష్మిని బండరాయి కేసి మోది దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. శ్రీలక్ష్మి గురించి ముక్తినూతలపాడులో విచారిస్తే కేవలం కోటేశ్వరరావు సైకోతత్వమే తప్ప ఆమె శీలాన్ని శంకించాల్సిన పనే లేదంటూ స్థానికులు పేర్కొంటుండటం గమనార్హం. 

సెల్‌ సిగ్నల్స్‌పై ప్రత్యేక దృష్టి
హత్య జరిగిన తర్వాత నిందితుడు నింపాదిగా విధులకు హాజరయ్యాడని తెలియగానే పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఎటువంటి నేరగాడైనా ఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుంచి సుదూరంగా పారిపోతాడు. మృతదేహాలను తగులబెట్టిన సమయంలో అతని చేతులకు గాయాలై ఉంటాయని భావించినా అతను ఎవరో తెలియకపోవడంతో సహకరించాలని సమాజంలోని అన్ని వర్గాలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. చివరకు నిందితుడిని పట్టిస్తే లక్ష రూపాయల బహుమానం కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు సెల్‌ నంబర్‌ను తెలుసుకున్న పోలీసులు హత్య తర్వాత అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, హత్య విషయం తెలిసి కూడా ఎవరైనా నిజాన్ని పోలీసులకు చెప్పకుండా దాచారా లేక నిందితుడికి సహకరించారా అన్న కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరో వైపు హత్యకు కొద్ది రోజుల క్రితం కూడా నిందితుడికి, హత్యకు గురైన శ్రీలక్ష్మి మొబైల్‌ నంబర్‌కు సంబంధించిన కాల్‌డేటాను కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దారుణమైన ఈ ఘటనపై ఎలాగైనా అత్యంత త్వరగా శిక్షపడాలంటే అందుకు శాఖాపరంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలంటూ పోలీసు అధికారులను ఇప్పటికే ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు. వివిధ దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రం, బిళ్లా వసంతరావు, దారా అంజయ్యలు దగ్గరుండి మృతదేహాలను ఖననం చేశారు.

ఒంగోలులో శ్రీలక్ష్మి మృతదేహాన్ని ఖననంచేస్తున్న దళిత నాయకులు, పోలీసులు
ముగిసిన అంత్యక్రియలు 
హత్యకు గురైన శ్రీలక్ష్మికి గురువారంతో 18 ఏళ్లు నిండాయి. కానీ ఆమె మైనార్టీ తీరకుండానే వివాహం కావడం, ఒక బిడ్డకు తల్లి కావడం, చివరకు భర్త చేతిలో 9 రోజుల క్రితమే దారుణ హత్యకు గురికావడం ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరి హృదయాలను కలవరపరుస్తున్నాయి. తోబుట్టువులు వచ్చినా కనీసం అంత్యక్రియలు సైతం చేసుకోలేని దుర్భర స్థితిని గమనించిన పోలీసులు, దళిత సంఘాల నేతలు అండగా నిలిచారు. చివరకు శ్రీలక్ష్మి అక్క జయలక్ష్మి సూచన మేరకు స్థానిక దశరాజుపల్లి రోడ్డులోని హిందూ శ్మశాన వాటికలో పూడ్చి పెట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల నుంచి హిందూ శ్మశాన వాటిక వరకు మృతదేహాలను తీసుకెళ్తున్నారని తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి కంట తడి పెట్టారు.

>
మరిన్ని వార్తలు