తల్లీకూతుళ్లను తగులబెట్టిన అజ్ఞాత వ్యక్తి

9 Dec, 2019 11:30 IST|Sakshi
అదృశ్యమైన తల్లీకూతుళ్లు దుర్గాభవాని, సమీర

అమలాపురంలో 20 రోజుల కిందట తల్లీబిడ్డల అదృశ్యం

ఈ దారుణానికి, అమలాపురం ఘటనకు సంబంధం ఉందేమోనని పోలీసుల అనుమానం

ఆ మృతదేహాలు తమవారివి కావని నిర్ధారణ

సాక్షి, అమలాపురం: ఇరవై రోజుల కిందట పట్టణంలో ఓ తల్లి, తన ఏడాది వయసు ఆడబిడ్డతో అదృశ్యమైంది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పట్టణ పోలీసు స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారు డొంక దారిలో ఐదు రోజుల కిందట ఓ తల్లిని, చిన్నారిని ఓ అజ్ఞాత వ్యక్తి తగులబెట్టి పరారయ్యాడు. ఈ రెండు కేసులు దాదాపు ఒకేలా ఉండడంతో అటు సంతనూతలపాడు.. ఇటు అమలాపురం పోలీసులు ఆ దిశగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు కేసుల మధ్య ఏమైనా లింకు ఉందా అనే దిశగా రెండు జిల్లాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదృశ్యమైన తల్లీ బిడ్డల కుటుంబ సభ్యులను విచారించారు. ఈ ఘటనపై విచారణకు ఇక్కడి పోలీసులు ప్రకాశం జిల్లా వెళ్లారు. కుటుంబ సభ్యులను కూడా ప్రకాశం జిల్లాలోని ఘటనా స్థలానికి తీసుకు వెళ్లారు. ఆ మృతదేహాల తాలూకు వస్తువులను బట్టి, హతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ జిల్లా నుంచి కూడా ఓ పోలీసు బృందం ఇక్కడకు వచ్చింది.

అదృశ్యమయ్యారిలా..
మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన వైదాడి దుర్గాభవాని(25)కి ఏడాది వయసున్న ఆడబిడ్డ సమీర ఉంది. బిడ్డను తీసుకుని గత నెల 15న దుర్గాభవాని అమలాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కుమార్తెను చిన్నపిల్లల వైద్యుడికి చూపించి వస్తానని బయలుదేరి వచ్చింది. అలా వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి రాలేదు. వారి కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. ఫలితం లేకపోవడంతో తొలుత నగరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా దుర్గాభవాని వచ్చిన అమలాపురం ఆస్పత్రి వద్ద కూడా పోలీసులు విచారణ జరిపారు. ఆస్పత్రి సీసీ కెమెరాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ఫోన్‌ చేయడం.. మోటారు సైకిల్‌పై ఓ యువకుడు రావడం.. అతడి బైక్‌పైనే తన బిడ్డతో ఆమె వెళ్లిపోయినట్లు రికార్డు అయింది. దీంతో కేసును అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అప్పటి నుంచీ ఈ అదృశ్యం కేసుపై దర్యాప్తు జరుగుతోంది.

పేర్లమెట్ట వద్ద ఏం జరిగిందంటే..
ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్లమెట్ట శివారులో బురదతో ఉన్న డొంక దారిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ మహిళ, ఏడాది వయసున్న బిడ్డ మంటల్లో తగులబడుతున్న దృశ్యాన్ని సమీపంలో ఉన్న కొందరు రైతులు చూశారు. ఆ సమాచారాన్ని గ్రామస్తులకు అందజేశారు. వారు ఫోన్‌ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికే ఆ రెండు మృతదేహాలూ దాదాపు కాలిపోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్లిన కొందరిని పోలీసులు విచారించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఇద్దరు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. తాము ఆ బురద దారిలో వెళుతున్నప్పుడు ఓ యువకుడు, ఓ యువతి, ఓ చంటిబిడ్డతో మోటారు సైకిల్‌పై వస్తూ ఆగి çకోపంతో వాదించుకుంటున్నారని ఆ స్వాములు పోలీసులకు తెలి పారు. ‘‘ఈ బురద దారిలో గొడవేమిటి? మీరెవరు?’’ అని తాము అడగగా.. తాము భార్యాభర్తలమని, అటుగా పనుండి వెళ్తున్నామని వారు చెప్పారని స్వాములు వివరించారు.

ఈ క్లూతో అక్కడి పోలీసులు ప్రకాశం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో తల్లీకూతుళ్లు అదృశ్యమైన కేసులేమైనా ఉన్నాయా అని ఆరా తీశా రు. అటువంటి కేసు ట్రేస్‌ కాలేదు. దాంతో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకూ ఈ సమాచారం పంపించారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో తల్లీ కూతురు అదృశ్యం కేసు నమోదై ఉండడం, ఈ రెండు ఘటనలకూ సారూప్యం ఉండడంతో ఇటు అమలాపురం, అటు సంతనూతలపాడు పోలీసులు ఆ దిశగా దర్యా ప్తు చేశారు. అక్కడ దొ రికిన మృత దేహాలు తమవారివి కావని దుర్గా భవా  ని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. వారి కోసం ఇక్కడి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.

ఆ యువకుడు ఎవరు?
అమలాపురం ఆస్పత్రి సీసీ ఫుటేజీల్లో ఉన్న యువకుడెవరనే దిశగా ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేశారు. దుర్గాభవానీని మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకు వెళ్లిన ఆ యువకుడిని స్థానిక వై జంక్షన్‌లో మోటారు సైకిళ్ల సీటు కవర్లు తయారుచేసే రమేష్‌గా గుర్తించారు. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు విచారణలో తేలింది. దుర్గాభవానీకి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అయోధ్యలంకకు చెందిన దగ్గరి బంధువుతో వివాహం జరిగింది. భర్త ప్రస్తుతం ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా పేర్లమెట్ట వద్ద లభించిన మృతదేహాలు తమవారివి కావని దుర్గాభవాని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు అంటున్నారు. దీంతో తల్లీకూతుళ్లు ఎక్కడున్నారనేది మిస్టరీగా మారింది. కావాలని అదృశ్యమైన ఆ యువకుడు, దుర్గాభవానీలు చిన్నారి సమీరతో సహా ఎక్కడో ఓచోట కలిసే ఉండి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.

మరిన్ని వార్తలు